రవిప్రకాశ్‌ కేసు విచారణ మళ్లీ వాయిదా

11 Jun, 2019 16:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు హైకోర్టులో ప్రారంభమైన రవిప్రకాశ్‌ కేసు విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి.

రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని... అందుకే బెయిల్‌ను నిరాకరించాలని హైకోర్టుకు విన్నవించారు. దేవేందర్‌ అగర్వాల్‌ రిజైన్‌ లెటర్‌లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ.. వారితో జరిపిన ఫోన్‌ చాటింగ్‌ స్ర్కీన్‌షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు