ఖాకీలపై చేయిచేసుకున్న నటిపై కేసు

2 Apr, 2019 13:01 IST|Sakshi

ముంబై : తాగిన మత్తులో ముంబైలోని బాంద్రాలో పోలీసు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన టీవీ నటి, మోడల్‌ రుహి సింగ్‌పై కేసు నమోదు చేశారు. స్నేహితులతో కలిసి రుహి సింగ్‌ పబ్‌ నుంచి తిరిగివస్తూ బాంద్రాలోని ఓ మాల్‌వద్ద ఆగారు. మాల్‌ సిబ్బందితో గొడవకు దిగడంతో వారు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఖర్‌ పోలీస్‌ స్టేసన్‌ నుంచి అక్కడికి చేరుకున్న పోలీసులతో సైతం రుహి సింగ్‌ బృందం వాగ్వాదానికి దిగింది.

రుహితో పాటు ఆమె స్నేహితులు రాహుల్‌ సింగ్‌, స్వప్నిల్‌ సింగ్‌ ఇద్దరు పోలీస్‌ సిబ్బందిపై చేయిచేసుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులపై దాడి చేసిన రుహి స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నటిపై రాష్‌ డ్రైవింగ్‌, దురుసు ప్రవర్తనపై కేసు నమోదు చేశారు. కాగా,  గత నెల 31 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.  రుహి సింగ్‌ నుంచి తీసుకున్న మెడికల్‌ శాంపిల్స్‌ను పరీక్షించగా ఆమె మద్యం సేవించినట్టు వెల్లడైందని అడిషనల్‌ కమిషనర్‌ (ముంబై పశ్చిమ) మనోజ్‌ కుమార్‌ శర్మ వెల్లడించారు. కాగా రుహి సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు