ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు!

29 Aug, 2018 12:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు సామాన్యుల ఇళ్లలోనే కాకుండా ప్రముఖల ఇళ్లోనూ తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. గతంలో ఎందరో ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. మరి ముఖ్యంగా కొందరు ప్రముఖుల పిల్లలు విలాసవంతమైన కార్లు, అధునాతన బైక్‌లు వాడి ప్రమాదాల బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడమే హరికృష్ణ మృతికి కారణాంగా తెలుస్తోంది. దీంతో ప్రముఖుల ఇళ్లలో జరిగిన రోడ్డుప్రమాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

  • 2003 అక్టోబరులో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు, పవన్ కుమార్(26) బైక్‌పై వస్తూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్‌ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.
  • 2010 జూన్‌లో సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు, కోట ప్రసాద్(39) బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు.
  • 2011 సెప్టెంబరులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్(19) ఔటర్ రింగ్‌ రోడ్డుపై తన 1000 సీసీ బైక్‌తో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.
  • 2011 డిసెంబర్‌లో మాజీ మంత్రి కోమటిరెడ్డి తనయుడు, ప్రతీక్‌ రెడ్డి(19) నార్సింగ్ -పటాన్‌ చెరు మధ్య కొల్లూరు సమీపంలో కారు ప్రమాదంలో మృతి చెందాడు. 
  • 2012 నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించారు.
  • 2013లో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ భాష రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
  • 2014 ఎన్నికల సమయంలో ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందారు.
  • 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరాం మృతి చెందాడు.
  • 2017 మేలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
  • 2017 జూన్‌లో ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు నటుడు భరత్‌ కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.


     

మరిన్ని వార్తలు