గుప్త నిధుల పేరుతో..

17 Sep, 2018 12:56 IST|Sakshi
కారుమంచి భోగేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దృశ్యం (ఫైల్‌)

కర్నూలు, ఆలూరు: గుప్తనిధుల పేరుతో పురాతన ఆలయాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆలయాలు శిథిలమై ఉనికిని కోల్పోతున్నాయి. ఆలూరు పోలీసు సర్కిల్‌ పరిధిలో ఇలా సుమారు ఆరు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. గతేడాది హత్తిబెళగల్‌ గ్రామ సమీపంలోని కొండపై సోమలింగేశ్వర దేవాలయంలో, హులే బీడు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం, హొళగుంద మండలం దేవరగట్టులో వెలసిన పురాతన బావిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గతంలో అధికార పార్టీకి చెందిన కొందరిపై పోలీసులు  కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆస్పరి మండలం కైరుప్పల, కారుమంచి గ్రామాల్లో శ్రీ భోగేశ్వర ఆలయం, మల్లప్ప పడ తదితర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా కొందరు పట్టుబడ్డారు.

దేవనకొండ మండలం తెర్నెకల్లు, పాలకుర్తి, నల్లచెలిమెల తదితర ప్రాంతాల్లో గుప్పనిధుల కోసం గతంలో వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల మళ్లీ తవ్వకాలు మొదలయ్యాయి.   ఈ నెల 3న కారుమంచి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన హంపి విరుపాక్షయ్య మఠాదీశుల పీఠానికి చెందిన శ్రీ భోగేశ్వర ఆలయంలో నిధుల కోసం శివలింగాన్ని ధ్వంసం చేశారు. నిధుల కోసం వివిధ రకాల పూజలు చేసి కట్టర్లతో శివలింగాన్ని తీయాలని ప్రయత్నించిగా విఫలమవడంతో లింగాన్ని తొలగించి మొత్తం పెకలించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందు ఆలయ సమీపంలో ప్రతిష్టించిన నాగదేవత విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారని చెప్పారు. నిధుల పేరుతో ప్రసిధ్ధి గాంచిన ఆలయాలను ధ్వంసం చేయడం తగదన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి చర్యలు పునరావృతం కావని వారు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు