రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

2 Aug, 2019 07:58 IST|Sakshi
ఈఓ రాంప్రసాద్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నఏసీబీ అధికారులు (ఇన్‌సెట్‌) ఈఓ రాంప్రసాద్‌  

సాక్షి, మంత్రాలయం(కర్నూలు)  : ఆలయ ఆదాయాలను దిగమింగాడో.. బినామీ కాంట్రాక్టర్‌ అవతారమెత్తి కాసులను మెక్కాడో తెలియదు గానీ మొత్తానికి ఆదాయానికి మించి ఆస్తులు గడించాడు ఈ పి.రాంప్రసాద్‌. ధర్మ సంస్కృతికే మచ్చ తెచ్చాడు. జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి గ్రేడు–1 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగాడు. ఎదుగుతూనే అక్రమ ఆస్తులను అంతకు అంత పెంచుకున్నాడు. గురువారం ఏసీబీ దాడుల్లో ఆయన అక్రమాస్తుల గుట్టు రట్టయ్యింది. దాదాపు పాతిక కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు రికార్డులు తెలుపుతుండడం దేవదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది.  

ఉరకుంద ఈరన్న స్వామి ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా రాంప్రసాద్‌ 1990లో ఉద్యోగం సంపాదించారు. ఏడేళ్ల క్రితం గ్రేడ్‌–1 ఈవోగా పదోన్నతి పొందారు. కసాపురం, మహానంది, శ్రీశైలం, ఉరకుంద, ఆదోని గ్రూపు టెంపుల్‌ ఈవోగా పనిచేశారు. 2013 నుంచి 2014 నవంబర్‌ వరకు , అనంతరం 2018 జూన్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఉరుకుంద ఆలయ ఈవోగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనూ హుండీ ఆదాయం పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతకు మించి బినామీ పేర్లతో టెంకాయ దుకాణాలు దక్కించుకోవడం, సున్నాలు వేయడం తదితర పలను చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ నాయకుల పంచన ఉండి పదవులతో పాటు పైకం కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.   

అక్రమాలు ఇలా బయటపడ్డాయి... 
ప్రస్తుతం గూడురు మండలం దేవాలయాల గ్రేడ్‌–1 గ్రూపు ఈఓగా పనిచేస్తున్న రాంప్రసాద్‌ అక్రమాలు..ఏసీబీ అధికారుల దాడులతో బయటికి వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు ఖాదర్‌భాష, శ్రీధర్, చక్రవర్తి, ప్రవీణ్‌కుమార్‌ ఆద్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఆదోని పట్టణంలోని రాంప్రసాద్‌ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లపై గురువారం దాడులు చేశారు. రాంప్రసాద్‌ తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లపై రూ.2కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాలో తేలింది. తాజా మార్కెట్‌ విలువ మేరకు వీటి విలువ పదింతలకు పైగా ఉండొచ్చని అంచనా. దాడుల్లో ఆదాయానికి మించి భారీ స్థాయిలో అస్తులు కూడబెట్టుకున్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు తెల్లబోయారు.  


సోదాలో పట్టుబడిన బంగారు, నగదు  

ఇవీ ఆస్తులు.. 
► రాంప్రసాద్‌ భార్య లక్ష్మీదేవి పేరుపై ఆదోని, ఎమ్మిగనూరులో 23 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి.  
► కోసిగిలో 2.5 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించారు.  
► ఇద్దరు కూతుళ్లు ఉండగా ఓ కూతురు పేరిట రూ.15.5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. 
► రూ.28.44లక్షలు అప్పు ఇచ్చినట్లు ప్రాంసరీనోట్లను అధికారులు గుర్తించారు. 
► కూతురు పేరిట ఉన్న 2 స్కూటర్లను అధికారులు జప్తు చేశారు. 
► ఇంట్లో దాచిన రూ.6లక్షల నగదు, 75 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 
► ఆదోని పట్టణంలో మొత్తం మూడు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబందించిన డాక్యుమెంట్లను కూడాస్వాధీనం చేసుకున్నారు. 
► కర్నూలు శ్రీనివాసనగర్‌లో కూడా ఇటీవలే ఇల్లు కొనుగోలు చేసిటనట్లు సోదాలు దొరికిన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది.  
► కర్నూలులో కూడా మరో మృందం సోదాలు నిర్వహిస్తోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు.  
► ఆదోని పట్టణంలోని కర్ణాటక బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం సోదాలు జరిపారు.  
► లాకర్‌లో రూ.లక్ష నగదు, 55 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. 
► రూ.40వేలు జీతం పొందుతున్న రాంప్రసాద్‌ రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడ బెట్టడం వెనుక అవినీతి అక్రమాలు ఉన్నట్లు తేటతెల్లం అవుతోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టుకున్న ఈఓ రాంప్రసాద్‌ ఇంటిపై జరిగిన ఏసీబీ దాడులు అక్రమార్కుల్లో వణుకు ప్రారంభం అయింది. ఇలాంటి అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారని, వారి ఆస్తులను కూడ గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు