పేటలో కలకలం

26 Dec, 2018 13:26 IST|Sakshi
ఘరానా మోసానికి పాల్పడిన గిరీష్‌సింగ్‌

రూ.25 కోట్లకు వ్యక్తి కుచ్చుటోపీ

నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన గిరీష్‌సింగ్‌  

సొంతూరికి వచ్చి హంగామా చేసిన వైనం

నెల్లూరు , సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని ఇసుకమిట ప్రాంతంలో ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో పూజారిగా ఉంటూ వచ్చిన ఇ.కె.గిరీష్‌సింగ్‌ భక్తి పేరుతో ఘరానా మోసానికి పాల్పడి కటకటాలపాలైన ఘటన సంచలనం రేపింది. ఆర్థిక నేరాలకు పాల్ప డిన కేసులో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.గతేడాది విజయదశమికి శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేందుకు రోల్స్‌ రాయీస్, బెంజికారులతో పాటు సుమారు ఎనిమిది మంది బౌన్సర్లతో సూళ్లూరుపేటలో నానా హంగామా చేశారు. ఒక మామూలు పూజారి పనిచేసుకుంటున్న వ్యక్తి ఇలా పెద్ద పెద్ద కార్లతో పాటు బౌన్సర్లతో వచ్చి హంగామా చేయడంతో ఇదేదో కథే అనుకున్నారు అందరూ. అందరూ అనుకున్నట్టుగానే భక్తులను మోసం చేసి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి పలు కేసుల్లో ఇరుక్కుని హైదరాబాద్‌లో ఊచలు లెక్కిస్తున్నారు. 

అసలు కథలోకి వెళితే సూళ్లూరుపేటకు చెందిన గిరీష్‌సింగ్‌ స్వామిజీ పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెట్టవచ్చని, తద్వారా కోట్లు పోగేసుకోవచ్చని ప్లాన్‌ చేసుకుని మకాం హైదరాబాద్‌కు మార్చుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తెలివిగా మోసం చేసి సుమారు రూ.25 కోట్లు మోసం చేశారని బాధితులు ఆరోపించడం విశేషం. తన తమ్ముడు దిలీప్‌సింగ్‌తో కలిసి ఆద్వైతక్రియ పేరుతో ప్రక్రియలను సృష్టించి మూఢ నమ్మకాలు ఉన్న వానిరి బాగా నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు ఫిర్యాదులు చేయడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్‌ చేశారు. అతనితో పాటు అతని తమ్ముడు దిలీప్‌సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూళ్లూరుపేటకు చెందిన సామాన్య పూజారి గిరీష్‌సింగ్‌ ఇంత భారీ ఎత్తున మోసం చేశారని పలు టీవీ ఛానెళ్లలో వరుస కథనాలు ప్రసారం కావడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా స్థానికంగా కూడా ఎవరైనా బాధితులున్నారా?, నగదు వసూలు చేశాడా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు