తమిళనాడులో ఘోర ప్రమాదం

7 Jan, 2019 02:02 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన అయ్యప్ప భక్తులు ప్రయాణించిన వాహనం

పది మంది అయ్యప్ప భక్తుల మృతి.. ఐదుగురికి తీవ్రగాయాలు

మృతులంతా మెదక్‌ జిల్లా వాసులే

రామేశ్వరం నుంచి వస్తుండగా ఘటన

ఎదురుగా వచ్చి ఢీకొన్న ట్రాలీ లారీ

నుజ్జునుజ్జయిన వ్యాన్‌.. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు

పుదుకొటై్ట మెడికల్‌ కాలేజీకి క్షతగాత్రుల తరలింపు

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు

క్షతగాత్రులకు మెరుగైన చికిత్సకు ఆదేశం

మృతదేహాల తరలింపునకు బయల్దేరిన నర్సాపూర్‌ తహసీల్దార్, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌

సాక్షి, చెన్నై/నర్సాపూర్‌/సిద్దిపేట: భక్తితో 41 రోజులు మండలదీక్ష పూర్తిచేశారు. ఉత్సాహంగా అయ్యప్ప దర్శనానికి శబరిమల బయలుదేరారు. దర్శనం బాగా జరిగిందని ఫోన్‌ చేసి చెప్పడంతో కుటుంబసభ్యులూ సంతోషించారు. ఇంకేం.. మరో మూడు, నాలుగు రోజుల్లో వచ్చేస్తారంటూ సంతోషిస్తున్న సమయంలోనే ఊహించని వార్త షాక్‌కు గురిచేసింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మృత్యువు ట్రాలీ లారీ రూపంలో కబళించింది. తమిళనాడులోని పుదుకొటై్ట్ట జిల్లా తిరుమయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు.

శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పరిధిలోని ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్‌లకు చెందిన 14 మంది అయ్యప్ప భక్తుల బృందం నాలుగు రోజుల క్రితం శబరిమలైకి వ్యాన్‌లో వెళ్లింది. డ్రైవర్‌తో పాటు 14మంది యాత్రకు బయలుదేరారు.

అయ్యప్ప దర్శనానంతరం ఈ భక్తులు రామేశ్వరానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని రామేశ్వరం–పుదుకోట్టై రాష్ట్ర రహదారిలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వీరు పయనిస్తున్న వ్యాన్‌ తిరుమయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ కంౖటైనర్‌ అతి వేగంగా దూసుకొచ్చి వీరి వ్యాన్‌ను ఢీకొంది. వేగంగా ఉన్న రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో సమీప గ్రామస్తులు ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, తిరుమయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  
 
లారీ వేగమే ప్రమాదానికి కారణం 

లారీ ఢీకొన్న వేగంతో వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ శకలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే డ్రైవర్‌ సహా ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే విగత జీవులయ్యారు. వారి మృతదేహాల్ని బయటకు తీసి, క్షతగాత్రులను పుదుకొట్టై మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిని ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. తీవ్రగాయాలైన మిగిలిన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారంతో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీఐజీ లలిత లక్ష్మి, జిల్లా కలెక్టర్‌ గణేష్, ఎస్పీ సెల్వరాజ్‌ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని వేగవంతం చేశారు.

భాషాపరమైన సమస్యల కారణంగా.. మృతులు, క్షతగాత్రుల వివరాలను సేకరించడం కష్టంగా మారింది. ఎట్టకేలకు తిరుమయం పోలీసులు వివరాలను సేకరించి.. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాల్ని పోస్టుమార్టం తర్వాత స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్‌ మండలం ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్‌ (21), జుర్రు మహేష్‌ (25), కర్రె నాగరాజు గౌడ్‌ (35).. మంతూరుకు చెందిన చీరాల శివసాయి ప్రసాద్‌ యాదవ్‌ (22), అయ్యన్నగారి శ్యాంగౌడ్‌ (22), రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు(42), అంబర్‌పేట క్రిష్ణగౌడ్‌ (35), చిన్నచింతకుంటకు చెందిన ప్యాట ప్రవీణ్‌గౌడ్‌ (21), జనుముల సురేశ్‌ (23) వీరితో పాటు వాహనం డ్రైవర్‌ సురేశ్‌ దుర్మరణం పాలయ్యారు.

ఖాజీపేటకు చెందిన మస్కూరి రాజు, కర్రె నరేశ్‌ గౌడ్, దొంతి భూమాగౌడ్, మంతూర్‌కు చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, మంగాపూర్‌కు చెందిన దేవులపల్లి వెంకటేశ్‌గౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్‌ లారీ డ్రైవర్‌ నిద్ర మత్తులో వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 మెదక్‌ జిల్లాలో విషాదం 
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందినవారు. దీంతో మెదక్‌ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్లాలోని మృతుల గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్వామి దర్శనానికి వెళ్లినవారు రెండు, మూడ్రోజుల్లో తిరిగొస్తారునుకుంటున్న సమయంలో.. ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్‌ గ్రామాలకు చెందిన 14 మంది 2వ తేదీ బుధవారం అయ్యప్ప దర్శనానికి శబరిమలైకి బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన టెంపో ట్రావెలర్‌ వాహనంలో వీరు ప్రయాణమయ్యారు.

ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్, జుర్రు మహేశ్, మస్కూరి రాజు, కర్రె నాగరాజు గౌడ్, కర్ర నరేశ్‌ గౌడ్, దొంతి భూమాగౌడ్‌లు, మంతూరు గ్రామానికి చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, చీరాల శివసాయి ప్రసాద్‌ యాదవ్, అయ్యన్నగారి శ్యాంగౌడ్‌లున్నారు. వారితో పాటు రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు, అబంరి పేట క్రిష్ణగౌడ్‌లు, చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ప్యాట ప్రవీణ్‌ గౌడ్, జనుముల సురేశ్‌లు కూడా ఈ బృందంలో ఉన్నారు. కాగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్‌ గ్రామానికి చెందిన దేవులపల్లి వెంకటేశ్‌ గౌడ్‌ సైతం వీరితో శబరిమల యాత్రకు బయలుదేరారు. 2వ తేదీన ఖాజీపేటలో ప్రత్యేక పూజలు పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. 
 
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ సంతాపం 
తమిళనాడు దుర్ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. అటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఈ ఘటనపై ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారని కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పుద్దుకొట్టై కలెక్టర్‌ ఎస్‌.గణేశ్‌తో హరీశ్‌ రావు ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాల్సిందిగా కోరారు. అలాగే మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సహకరించాలన్నారు.

మృతదేహాల తరలింపుపై మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి కూడా అక్కడి కలెక్టర్‌ గణేశ్‌తో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువచ్చేలా చూడాలని టీఆర్‌ఎస్‌ జిల్లా నేత మురళీయాదవ్‌కు హరీశ్‌ రావు సూచించారు. నర్సాపూర్‌ తహసీల్దార్‌ భిక్షపతి, సీఐ సైదులను వెంటనే తమిళనాడు వెళ్లి మృతదేహాలను తీసుకురావటంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
 
 
మృతుల వివరాలు 
 
1. బోయిని కుమార్‌ (21): ఖాజీపేటకు చెందిన బోయిని మల్లేశ్, బాలమణి దంపతుల కుమారుడు బోయిని కుమార్‌ (21). హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబలో విషాదం నెలకొంది. 
 
2. మహేశ్‌ యాదవ్‌ (25): ఖాజీపేటకు చెందిన జుర్రు సాయిలు, మల్లమ్మ దంపతుల కుమారుడు జుర్రు మహేశ్‌ యాదవ్‌. ఆయనకు ఆర్నెల్ల క్రితమే వివాహం జరిగింది. నర్సాపూర్‌లో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నాడు. 
 
3. నాగరాజు గౌడ్‌ (35): ఖాజీపేటకు చెందిన కర్రె రామాగౌడ్, యాదమ్మ దంపతుల పిల్లలు కర్రె నాగరాజు గౌడ్, కర్రె నరేష్‌ గౌడ్‌లు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకుని శబరిమలకి వెళ్లారు. ప్రమాదంతో పెద్దవాడైన నాగరాజు మృతి చెందాడు. తమ్ముడు నరేశ్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. నాగరాజుగౌడ్‌ 15 సార్లు అయ్యప్పస్వామి మాల ధరించాడు. మృతుడికి భార్య లక్ష్మి, పిల్లలు లోహిక, చరణ్‌గౌడ్‌లు ఉన్నారు.లాయన నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు బస్సు డ్రైవర్‌గా ఉన్నారు. 
 
4. చీరాల శివ సాయి ప్రసాద్‌ (22): మంతూర్‌ గ్రామానికి చెందిన చీరాల మల్లేశ, మలమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ సాయి ప్రసాద్‌. హైదరాబాద్‌లోని ఓ కాలేజీ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. 
 
5. అయ్యన్నగారి శ్యాంసుందర్‌గౌడ్‌ (22): మంతూర్‌కు చెందిన అయ్యన్న గారి సంజీవగౌడ్, సుజాత దంపతులకు ఏకైక కుమారుడు శ్యాంసుందర్‌ గౌడ్‌. సంజీవ్‌ గౌడ్‌ రైతు కాగా.. మృతుడు నర్సాపూర్‌లో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. 
 
6. నక్క ఆంజనేయులు (42): రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు నర్సాపూర్‌లో మోటారు వైండింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, పిల్లలు సాయి, మహాసిరిలు ఉన్నారు. టుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 
 
7. అంబర్‌పేట క్రిష్ణగౌడ్‌ (35): రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబర్‌పేట క్రిష్ణగౌడ్‌కు భార్య లత, ఇద్దరు పిల్లలు (అభినవ్, అభిరాం) ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ క్రిష్ణ గౌడ్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
8. జనుముల సురేశ్‌ (23): నర్సాపూర్‌ మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన జనుముల సురేశ్‌ మొబైల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలోనే భర్తను కోల్పోయిన ఆ యువకుడి తల్లి.. ఇప్పుడు కుమారుడు కూడా ఇక రాడని తెలిసి రోదిస్తున్న తీరు కలచివేసింది. 
 
9. ప్రవీణ్‌ గౌడ్‌ (21): మెదక్‌ మండలంలోని గడ్డమోనిపల్లికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, భాగ్యమ్మల కుమారుడైన ప్రవీణ్‌గౌడ్‌ తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన తన తాత అంజా గౌడ్‌ ఇంట్లో ఉంటూ నర్సాపూర్‌లో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. 
 
10. సురేశ్‌ (వాహనం డ్రైవర్‌): ఆయన గురించిన వివరాలు తెలియరాలేదు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా