చీటీల పేరుతో మోసం

28 Jan, 2020 12:25 IST|Sakshi
వెలుగు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బాధిత మహిళలు

రూ.10 లక్షలు ఎగనామం

చిత్తూరు,తొట్టంబేడు : చీటీల పేరుతో వెలుగు కార్యాలయ సిబ్బంది రూ.10 లక్షలు ఎగనామం పెట్టారు. ఈ మేరకు బాధితులు సోమవారం వారిని నిలదీశారు. వారు చెప్పిన వివరాల మేరకు.. వెలుగు కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సరిత, మాజీ ఉద్యోగి వెంకటేష్‌ దీపావళి ధమాకా పేరుతో ఓ నెలసరి చిట్టీని ప్రారంభించారు. నెలకు ఒక్కొక్క మహిళ రూ.600 వంతున ఏడాదికి రూ.7,200 చెల్లించాలి. ఇలా చెల్లించిన మహిళలకు దీపావళి ధమాకా పేరుతో 22 క్యారెట్ల బంగారు 2 గ్రాములు, 30 గ్రాముల వెండి కామాక్షమ్మ దీపం, స్టీల్‌ తాంబూలం తట్ట, కిలో స్వీట్, టపాకాయల పెట్టె అందజేస్తామని ఆశ చూపారు.

అంతేకాకుండా దీపావళికి నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పారు. తంగేళ్లపాలెం, తొట్టంబేడు, కొత్తకన్నలి, శివనాథపాలెం తదితర గ్రామాలకు చెందిన 100 మంది పేద మహిళలు డబ్బు కట్టారు. రెండేళ్లు డబ్బు కట్టినా ఎలాంటి ప్రతిఫలమూ ముట్టకపోవడంతో సరితను బాధిత మహి ళలు నిలదీశారు. తనకు సంబంధం లేదని, వెంకటేష్‌ను అడగాలని ఆమె కాలం వెళ్లదీస్తూ వచ్చింది. సోమవారం బాధితులందరూ ఏకమై వెలుగు కార్యాలయంలో సరితను నిలదీశారు. ఆమె సరిగా సమాధానం చెప్పకపోవడంతో బాధితులు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు రావాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. ఈ విషయమై వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్‌ డాంగే యాదవ్‌ను వివరణ కోరగా అది వారి వ్యక్తిగతమని, తమకు ఎలాంటి సంబంధమూ లేదని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు