కామాంధులకు పదేళ్ల జైలు

7 Feb, 2019 11:42 IST|Sakshi

దివ్యాంగ యువతులపై అఘాయిత్యాలు..

క్రిష్ణగిరి కోర్టు తీర్పు  

కర్ణాటక, హొసూరు: రెండు ప్రాంతాల్లో ఇద్దరు దివ్యాంగ యువతులపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులకు క్రిష్ణగిరి కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా కుందమారనపల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల దివ్యాంగ యువతి గత 2015 జనవరి 14వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన మునిరాజ్‌ (21), రామమూర్తి (22)లు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశారు. 

మరో కేసులో.. డెంకణీకోట సమీపంలోని బాలతోటనపల్లికి చెందిన 20 ఏళ్ల దివ్యాంగ యువతి 2015 అక్టోబర్‌ 18వ తేదీ ఇంటి ముందు కొళాయిలో నీరు పట్టుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన వీరేంద్రన్‌(27), సంతోష్‌(22)లు ఆమెను వీరేంద్రన్‌ ఇంటికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటనలపై డెంకణీకోట మహిళా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులందరినీ అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. క్రిష్ణగిరి కోర్టులో బుధవారం ఈ కేసులు తుది విచారణకు వచ్చాయి. నలుగురికి తలా రూ. 15 వేలు జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కళైయరసి తీర్పునిచ్చారు.

మరిన్ని వార్తలు