అమెరికాలో దుండగుడి కాల్పులు..తెనాలి వాసి మృతి

8 Sep, 2018 04:31 IST|Sakshi
పృథ్వీరాజ్‌(ఫైల్‌)

     సిన్‌సినాటిలోని ఫిఫ్టథర్డ్‌ బ్యాంకులో పనిచేస్తున్న పృథ్వీరాజ్‌

     బ్యాంకు వద్ద విచక్షణారహితంగా కాల్పులు

     పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు మృతి

     నిందితుడిని హతమార్చిన భద్రతాదళాలు

న్యూయార్క్‌ /తెనాలి రూరల్‌: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని సిన్‌సినాటి నగరంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటల సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్‌(25) మరణించాడు. ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన పృథ్వీరాజ్‌ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సిన్‌సినాటిలోని ఫిఫ్టథర్డ్‌ బ్యాంకులో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా రెండున్నరేళ్ల క్రితం ఉద్యో గంలో చేరాడు. గురువారం ఉదయం బ్యాంక్‌ లోడింగ్‌ సెక్షన్‌ వద్ద కాల్పులు జరిపిన నిందితుడు..ఆ తరువాత లాబీలోకి చొరబడి విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడు ఒమర్‌ ఎన్రిక్‌ శాంటా పెరెజ్‌ (29) మరణించాడు. ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీ స్థాయిలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి బ్యాంకుతో ఎటువంటి సంబంధం లేదని, కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. 

వివాహం చేద్దామునుకున్న తరుణంలో విషాదం
గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో కెప్టెన్‌ విజయేంద్రప్రసాద్‌ రోడ్డులో నివసించే కందేపి గోపీనాథ్‌ విజయవాడలోని గృహనిర్మాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సుధారాణి గృహిణి. వీరికి కుమారుడు పృథ్వీరాజ్, కుమార్తె మనోజ్ఞ ఉన్నారు. పృథ్వీరాజ్‌ పదో తరగతి వరకు తెనాలిలోని ప్రైవేట్‌ పాఠశాలలో, ఇంటర్‌ విజయవాడలో చదివాడు. తమిళనాడులోని విట్‌లో బీటెక్‌ చదివి, అమెరికాలోని కాలిఫోర్నియాకి వెళ్లి ఎంఎస్‌ చేశాడు. అనంతరం బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. పృథ్వీరాజ్‌ మరణించాడన్న వార్త అతడి సహద్యోగి నుంచి, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం నుంచి కుటుంబీకులకు అందింది. అమెరికాలో స్థిరపడ్డాడని, ఇక వివాహం చేయాలన్న ఆలోచనలో తలిదండ్రులు ఉండగానే ఈ ఘటన జరిగింది.

విధి నిర్వహణలో భాగంగా ఢిల్లీ వెళ్లిన పృథ్వీరాజ్‌ తండ్రి గోపీనాథ్‌ తిరుగు ప్రయాణంలో ఉండగా, గురువారం అర్ధరాత్రి దాటాక కుమారుడి మరణవార్త ఆయనకు తెలిసింది. శుక్రవారం ఉదయానికి ఆయన తెనాలి చేరుకున్నారు. గురువారం ఉదయమే తనతో పృథ్వీ మాట్లాడాడని..కొద్దిగంటల్లోనే కుమారుడి మరణవార్తను వినాల్సి వచ్చిందని గోపినాథ్‌ గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న బంధువులు, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పృ«థ్వీ ఇంటికి చేరుకుని మృతుని తల్లిదండ్రులను, సోదరిని ఓదార్చారు. పృ«థ్వీ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అమెరికాలోని బంధువులు, తానా సభ్యులతో మాట్లాడుతున్నామని గోపీనాథ్‌ స్నేహితుడు ఆనంద్‌ తెలిపారు. కాగా, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సభ్యుడొకరు మాట్లాడుతూ..పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు