రాలిన విద్యాసుమం

16 Feb, 2018 12:15 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని పార్వతి

వ్యాన్‌ ఢీ కొని విద్యార్థిని మృతి

విద్యార్థిని బలిగొన్న వైనం

సహచార విద్యార్థినుల ఎదుటే ఘోరం

సంఘటనా స్థలంలోనే ప్రాణం విడిచిన చిన్నారి

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు  

రోజూలాగే పాఠశాలకు సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరిన ఆ చిన్నారిని మృత్యువు ట్రాన్స్‌కో వ్యాను రూపంలో బలిగొంది. పాఠశాలకు సహచర విద్యార్థినిలతో బయలుదేరిన ఆ చిన్నారి అంతలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కొల్పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుపై ఆసక్తితో కన్నతల్లిని వీడి పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్న ఆ చిన్నారిని మృత్యువు కబళించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చదువు కోసం పెద్దమ్మ దగ్గర ఉంచితే ఇలా చేశావా! దేవుడా!!అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

బాడంగి:  మండల కేంద్రంలోని ఎత్తుఖానా సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగిరెడ్డి పార్వతి(15) అనే పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మండలంలోని పిన్నవలసకు చెందిన పార్వతి చదువు నిమిత్తం డొంకినవలసలోని పెద్దమ్మ గంటి శకుంతల ఇంటి వద్ద ఉంటోంది. ఇక్కడ నుంచే సైకిల్‌పై స్థానిక హైస్కూల్‌కు తోటి విద్యార్థినులతో కలసి రోజూ వెళ్లి వస్తోంది. రోజూలాగే గురువారం కూడా పాఠశాలకు సహచర వి ద్యార్థినులతో వెళ్తుండగా అడ్డురోడ్డు గుండా వస్తూ మలుపు వద్ద మెయిన్‌ రో డ్డు ఎక్కుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాన్స్‌కో వ్యాన్‌ బలంగా ఢీకొంది. పా ర్వతి రోడ్డుపైకి తుళ్లి పడిపోగా తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెం దింది. విద్యార్థి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.రవికుమా ర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృత్యువై వచ్చి...
రోజూలాగే పాఠశాలకు బయలుదేరిన పార్వతిని ట్రాన్స్‌కో వ్యాన్‌ మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మలుపు వద్ద నెమ్మదిగా వస్తున్న పార్వతి సైకిల్‌ను అతి వేగంతో వస్తున్న ట్రాన్స్‌కో వ్యాను ఢీకొట్టి ఆమె కాలి పైనుంచి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం విడిచిన పార్వతిని కళ్లారా చూసిన సహచర విద్యార్థినులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.  పార్వతి మృతితో కన్నవారి గ్రామం పిన్నవలసతో పాటు పెద్దమ్మ గ్రామమైన డొంకినవలసలో విషాదం అలముకొంది. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

పరామర్శించిన డీఈఓ
విద్యార్థిని పార్వతి దుర్మరణం చెందిన విషయం తెలుసుకొన్ని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, ఉప విద్యాశాఖాధికారిణి రమణమ్మ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థిని మృతదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. విద్యా శాఖ తరఫున రూ.పది వేలు ఆర్థిక సాయం తల్లిదండ్రులకు అందజేశారు. బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బేబీనాయన సంతాపం తెలిపి రూ.5వేలు సాయం అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం దాస్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని తమ సంతాపం తెలిపారు.  

మరిన్ని వార్తలు