అదృశ్యమైన విద్యార్థిని హత్య?

11 Feb, 2019 11:11 IST|Sakshi
సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న ఎస్పీ పొన్ని, (ఇన్‌సెట్‌) సరిత (ఫైల్‌)

పాఠశాలకు వెళ్లి అదృశ్యమైన విద్యార్థిని..

ఐదు నెలల తర్వాత     శరీర భాగాలు గుర్తింపు

చెన్నై ,పళ్లిపట్టు: ఐదు నెలల క్రితం అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి శరీర భాగాలు ఆదివారం గుర్తించారు. పళ్లిపట్టు సమీపంలోని కీచలం గ్రామ పంచాయతీ కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కూలీ. అతని కుమార్తె సరిత (15). కీచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే. ఈమె గత ఏడాది సెప్టెంబర్‌ 7, 2018న ఇంటి నుంచి పాఠశాలకు అని బయలుదేరింది. అయితే రాత్రికి ఎంత పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, ఆ రోజు పాఠశాలకు సరిత రాలేదని తెలిసింది దీంతో పొదట్టూరు పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తూ వచ్చారు. 

ఐదు నెలలుగా సరిత గురించి ఎలాంటి సమాచారం తెలియని పరిస్థితిలో ఆదివారం సాయంత్రం కీచలం గ్రామానికి సమీపంలో సురేష్‌నాయుడు అనే రైతుకు సంబంధించి చెరకు తోట సమీపంలోని బందకాలువ వద్ద సరిత దుస్తులు, చెప్పులు, తల వెంట్రుకలు, శరీర భాగాల ఎముకలను కూలీలు గుర్తించారు. సురేష్‌నాయుడు ఇచ్చిన సమాచారంతో పొదటూరు పేట ఎస్‌ఐ రవి, సీఐ రమేష్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పుడు ఐదు నెలల క్రితం అదృశ్యమైన సరితగా ఉండవచ్చని అనుమానంతో ఆమె తల్లిదండ్రులను రప్పించారు. అక్కడ ఉన్న దుస్తులు తదితరాలను చూసి ఆ శరీర భాగాలు తమ కుమార్తె సరితవేనని గుర్తించి బోరున విలపించారు.

ఐదు నెలల క్రితం అదృశ్యమైన విద్యార్థిని మృతదేహం లభ్యమైన విషయం తెలియడంతో తిరువళ్లూరు జిల్లా ఎస్పీ పొన్ని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, పాఠశాలలో విద్యార్థినిని ఎవరైనా అగంతకులు అత్యాచారం చేసి, చంపి ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మరిన్ని వార్తలు