విద్యార్థి మృతిపై వీడని మిస్టరీ

3 Oct, 2018 13:06 IST|Sakshi
స్కూల్‌ ఆవరణలో పోలీసుల పహారా, మృతుడు సాయి ప్రసాద్‌(ఫైల్‌) ఉపాధ్యాయుడు బాలాజీ

అజ్ఞాతంలోకి తరగతి ఉపాధ్యాయుడు

యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపణలు

ప్రేమ వ్యవహారం కోణంలో పోలీసుల విచారణ

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలోని మాంటిస్సోరి స్కూలులో పదో తరగతి చదువుతూ సోమవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి చనిపోయిన ఘటనకు సంబంధించి మిస్టరీ వీడలేదు. యాజమాన్యం వేధింపుల కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటేశ్వరరావు కుమారుడు అన్నాబత్తుల నాగవెంకట సాయిప్రసాద్‌ సోమవారం సాయంత్రం మాంటిస్సోరి స్కూలు ఆవరణలో హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు మృతదేహంతో హాస్టల్‌ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూలు ఫర్నీచర్‌తో పాటు స్కూలు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు స్కూలు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు స్కూలు యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలితంగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రిలోని శవాగారానికి తరలించారు. మంగళవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే బంధువుల డిమాండ్‌ మేరకు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం మొత్తం వీడియో కెమెరా ద్వారా తీయించారు.

ప్రేమ వ్యవహారం...?
స్కూలు ఆవరణలోని హాస్టల్‌ భవనంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సాయిప్రసాద్‌ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రేమలేఖ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. స్కూలులో చదువుతున్న ఒక బాలికకు సాయిప్రసాద్‌ రాసిన ప్రేమలేఖ ఇప్పుడు కీలకంగా మారినట్టు సమాచారం. ప్రేమలేఖ ఉపాధ్యాయురాలి ద్వారా సాయిప్రసాద్‌ తరగతి ఉపాధ్యాయుడు, లెక్కల టీచర్‌ బాలాజీకి చేరినట్టు  తెలిసింది. దీంతో నాలుగు రోజులుగా పనిష్మెంట్‌ పేరుతో సాయిప్రసాద్‌ను బయట నిలబెడుతూ తీవ్రంగా కొడుతున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం విద్యార్థి తండ్రికి కబురు పంపిన యాజమాన్యం విషయం తెలియజేశారు. అయితే ఇదే సమయంలో స్కూల్‌ డైరెక్టర్‌ ఉమా మహేశ్వరరావు విద్యార్థిని చితకబాదగా కోపంతో తండ్రి కూడా చేయి చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వచ్చి తన కుమారుణ్ని తీసుకెళ్లిపోతానని చెప్పిన తండ్రి సాయంత్రం స్కూలుకు వచ్చే సరికి ఉరి వేసుకున్న సాయిప్రసాద్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహంతో హాస్టల్‌కు వచ్చి బైఠాయించారు.

అజ్ఞాతంలోకి బాలాజీ...?
సాయి ప్రసాద్‌ను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు కారణమైన క్లాస్‌ టీచర్‌ బాలాజీతో పాటు స్కూలు డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతని ఫేస్‌బుక్‌ ఖాతాను సైతం క్లోజ్‌ చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు సీఐ కె.ఎ.స్వామి తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు