రాలిపోయిన విద్యాకుసుమం

24 Mar, 2018 12:34 IST|Sakshi
తిరుమలసాయి(ఫైల్‌) , రోదిస్తున్న తల్లి గౌరమ్మ, కుటుంబ సభ్యులు

ఆటో బోల్తా పడిన సంఘటనలో  విద్యార్థి మృతి

ఖడ్గవలసలో విషాదఛాయలు

పార్వతీపురంటౌన్‌/గరుగుబిల్లి: ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది. దీనికి సంబంధించి జియ్యమ్మవలస ఎస్సై లక్ష్మణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం ఖడ్గవలసకు చెందిన మరిశర్ల తిరుమలసాయి (15) నాగూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి కాగా, రావివలస ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం జరిగిన పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లడానికి తోటి విద్యార్థులతో కలిసి ఆటో ఎక్కాడు. జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస గ్రామ సమీపంలోని మలుపువద్దకు వచ్చేసరికి ఆటో తిరగబడింది. ఈ సంఘటనలో తిరుమల సాయి అక్కడికక్కడే మృతి చెందగా, నాగూరుకు చెందిన మిరియాల ప్రకాష్‌ , దాసరి మధు, చింతాడ మణికంఠ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అదే ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

ఖడ్గవలసలో విషాద ఛాయలు
చదువులో రాణిస్తున్న తిరుమల సాయి ప్రమాదంలో మృతి చెందడంతో ఖడ్గవలసలో విషాదఛాయలు అలముకున్నాయి. తిరుమలసాయి తల్లిదండ్రులు అప్పలనాయుడు (తాతబాబు), గౌరమ్మలు కూలి పనులు చేసుకుంటూ కుమారుడ్ని చదివిస్తున్నారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడి తమను ఆదుకుంటాడనుకున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, సోదరి లావణ్య లబోదిబోమంటున్నారు. ఇక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు సాయి.. అని రోదిస్తున్న వారిని చూసి చూపరుల కళ్లు చెమర్చాయి. సాయి మృతి వార్త తెలుసుకున్న నాగూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్‌. చంద్రశేఖరరావు, ఎంఈఓ ఎన్‌. నాగభూషణరావు ఖడ్గవలస చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాఠశాలకు పేరు తీసుకువస్తాడనుకున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు