పుట్టిన రోజే అనంత లోకాలకు..

27 May, 2019 12:03 IST|Sakshi
శిరీష (ఫైల్‌)

విద్యుత్‌ షాక్‌తో విద్యార్థిని మృతి  నెరిణికండ్రిగలో విషాదం

చిత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ:  ఇటీవల పదో తరగతి ఫలితాల్లో  శిరీష ప్రతిభ చాటింది. ఆదివారం ఆ విద్యార్థిని పుట్టిన రోజు. దీంతో ఇల్లంతా సందడి, సందడిగా ఉంది. పైగా తెల్లారితే నూతన గృహ ప్రవేశ కార్యక్రమం కూడా ఉంది. అందరూ సంతోషంగా, సందడితో ఉంటున్న ఆ ఇంటిలో ఉన్నట్లుండి విషాదం అలుముకుంది. పుట్టినరోజే విద్యుత్‌ షాక్‌ రూపంలో విద్యార్థిని మృత్యువు కబళించింది. ఈ  సంఘటన నెరిణికండ్రిగలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు నెరిణికండ్రిగ ఎస్సీ కాలనీకి చెందిన అంకయ్య, సుమలతల కుమార్తె శిరీష నెలవాయి పాఠశాల్లో 10 వ తరగతి చదివింది.

ఇటీవల విడుదలైన ఫలితాల్లో 9.2 పాయింట్లతో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం నూతన గృహాప్రవేశం కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఇంట్లో విద్యుత్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శిరీష నీటి కోసం మోటరు వేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురయింది. గమనించిన కుటుంబ సభ్యులు శిరీషను శ్రీకాళహస్తిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శిరీష పుట్టినరోజే చనిపోవడంతో కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. శిరీష మృతిపై ఎంఈఓ రవీంద్రనాథ్, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, తెలుగుపండిట్‌ పురుషోత్తమ్‌ విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు