పదవ తరగతి విద్యార్థిని హత్య

2 Aug, 2018 09:20 IST|Sakshi
ఆస్పత్రిలో బంధువులు

అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ

నిందితులను అరెస్టు చేయాలని వివిధ సంఘాల ప్రతిఘటన  

కర్ణాటక, మాలూరు: పదవ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి హత్య చేసిన ఘటన బుధవారం సాయంత్రం పట్టణంలో సంచలనం సృష్టించింది. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఇందిరా నగర్‌లో ఉంటున్న విద్యార్థిని (15) హత్యకు గురైంది. ఆమె పట్టణంలోని బాలగంగాధర నాథ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతోంది. నిత్యం ఇంటి నుంచి నడుచుకుని పాఠశాలకు వెళ్లి వచ్చేది. బుధవారం సాయంత్రం కూడా పాఠశాల వదలగానే నడుచుకుని ఇంటికి వస్తున్న సమయంలో కొంతమంది యువకులు బాలికను అడ్డగించి రాయితో తలపై బలంగా కొట్టారు. దీంతో విద్యార్థిని ఘటనా స్థలంలోనే మరణించింది. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని హంతకులు రైల్వే బ్రిడ్జి కింద పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. రైల్వే బ్రిడ్జికింద శవమై పడి ఉండడాన్ని పట్టణ ప్రజల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. వెంటనే పట్టణ పోలీసులు ఎస్‌ఐ మురళి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిందితులను అరెస్టు చేయాలని ధర్నా
విద్యార్థిని హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కరవే కార్యకర్తలతో పాటు పలు సంఘాల కార్యకర్తలు నగరంలోని మారికాంబ సర్కల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎస్‌ఐ మురళి ఆందోళనతో కారులతో చర్చించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినా శాంతించని ఆందోళన కారులు ఎస్పీ రావాలని పట్టు బట్టారు. తమ కుమార్తెను ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని రోదించారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కూడా పెద్ద సంఖ్యలో జనం చేరడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు