పట్టుకోవడానికి పదహారేళ్లు!

16 Aug, 2018 04:41 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న రెహ్మాన్‌ (ముసుగు వ్యక్తి)

     పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాది రెహ్మాన్‌ 

     ముంబై ఘట్కోపర్‌ పేలుళ్ల కేసులో నిందితుడు

సాక్షి, హైదరాబాద్‌: పదహారేళ్ల క్రితం ముంబై సబర్బన్‌ ప్రాంతమైన ఘట్కోపర్‌లో జరిగిన పేలుడు కేసులో నిందితుడు యహ్యా అబ్దుల్‌ రెహ్మాన్‌ పోలీసులకు ఇప్పటికి చిక్కాడు. అప్పట్లో దుబాయ్‌ పారిపోయిన ఇతగాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక తనపై పోలీసు నిఘా ఉండదనే ఉద్దేశంతో తిరిగి రావాలనుకున్నాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. రెహ్మాన్‌ను పట్టుకునేందుకు అదనుగా భావించిన గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌)  రెహ్మాన్‌ను మాటు వేసి పట్టుకుంది. అనంతరం రెహ్మాన్‌ను ముంబై పోలీసులకు అప్పగించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే ఘట్కోపర్‌ కేసులో నగరానికి చెందిన మరో ఇద్దరు నిందితులుగా ఉండి, నిర్దోషులుగా బయటపడ్డారు.  

ఇద్దరిని బలిగొన్న బాంబు పేలుడు 
ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా 2002 డిసెంబర్‌ 2న ఘట్కోపర్‌ ప్రాంతంలో బెస్ట్‌ (బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) విభాగానికి చెందిన బస్సు సీటు కింద ఏర్పాటు చేసిన బాంబు పేలి ఇద్దరు చనిపోయారు. దాదాపు 70 మంది క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా ముంబై పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మంది ఉగ్రవాద అనుమానితుల్ని అరెస్టు చేశారు. అయితే వీరిపై కేసు వీగిపోగా మిగిలిన వారిపై విచారణ జరగాల్సి ఉంది.  

ఇక్కడి వారు ఇద్దరూ మృతి 
ఘట్కోపర్‌ పేలుడు కేసులో నగరానికి చెందిన ఇద్దరు నిందితులుగా అరెస్టు అయ్యారు. వీరిలో ఒకరైన రజాక్‌ 2012లో హుమాయున్‌నగర్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకోగా, సలావుద్దీన్‌ 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మల్లేపల్లికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్‌ మసూర్‌ 1997–98ల్లో దుబాయ్‌ వెళ్ళి ఎల్‌ఈటీతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాక్‌లో శిక్షణ అనంతరం 2002లో రజాక్‌ ఎల్‌ఈటీ భారత్‌లో చేసే ఆపరేషన్లకు కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడే ఉంటూ 2002 నవంబర్‌ 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, ఘట్కోపర్‌ బ్లాస్ట్‌ తదితరాలను పర్యవేక్షించాడు. 2005 ఆగస్టులో ఢిల్లీ స్పెషల్‌సెల్‌ పోలీసులకు అక్కడి జకీర్‌నగర్‌ ప్రాంతంలో పట్టుబడ్డాడు. విచారణలోనే ఘట్కోపర్‌ కేసు అంగీకరించడంతో అక్కడి పోలీసులూ అరెస్టు చేశారు. హుమాయున్‌నగర్‌లోని వెంకటాద్రి కాలనీలో ఉండే రజాక్‌ 2012 అక్టోబర్‌ 10న ఆత్మహత్య చేసుకున్నాడు.

గత ఆదివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఐసిస్‌ ఉగ్రవాద అనుమానితుడు అబ్దుల్లా బాసిత్‌ మేనమామ సలావుద్దీన్‌ సైతం ఘట్కోపర్‌ పేలుళ్ల కేసులో నిందితుడే. నల్లగొండకు చెందిన సలావుద్దీన్‌ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) నార్త్‌రన్‌ రీజియన్‌ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్ర నిషేధించిన తరవాత సలావుద్దీన్‌ దుబాయ్‌కు మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఘట్కోపర్‌ పేలుళ్లకు సహకరించాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు జైలు నుంచి బయటకు వచ్చాడు. 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఘట్కోపర్‌ పేలుళ్ల కేసుకు సంబంధించి రజాక్, సలావుద్దీన్‌పై ఉన్న అభియోగాలు వారు మరణించడానికి ముందే అక్కడి కోర్టులో వీగిపోయాయి. 

మరిన్ని వార్తలు