ముగ్గురు యువతుల నుంచి వాంగ్మూలం

13 Nov, 2018 04:40 IST|Sakshi

నమోదు చేసిన విశాఖ నాల్గో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ 

జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడికి బెయిల్‌పై నేడు విచారణ

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ముగ్గురు యువతుల నుంచి విశాఖపట్నం నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ వాంగ్మూలం తీసుకున్నారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుతోపాటు విశాఖ విమానాశ్రయం ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న హేమలత, రమాదేవి, అమ్మాజీలను పలు కోణాల్లో విచారించారు.

ఈ కేసులో సాక్ష్యాల నమోదు కోసం సిట్‌ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద తాజాగా నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట సోమవారం హాజరు పరిచారు. వారి నుంచి మేజిస్ట్రేట్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది అబ్దుల్‌ సలీం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. ఈ పిటిషన్‌పై ఒకటవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

మరిన్ని వార్తలు