తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి దుర్మరణం

15 Apr, 2019 10:15 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మరణించిన తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

కారు అదుపుతప్పి బోల్తా

సంఘటన స్థలంలోనే మృత్యువాత

తహసీల్దార్‌ మృతి బాధాకరం : కలెక్టర్‌

గార్లదిన్నె: విధులు ముగించుకుని స్వగ్రామానికి కారులో వస్తున్న తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి(42)ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శింగనమల మండలం గోవిందరాయునిపేటకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి జిల్లాలోని చిలమత్తూరు, సోమందేపల్లి, పెద్దవడుగూరు మండలాల్లో తహసీల్దార్‌గాను, పామిడిలో డీటీగాను పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా బనగానిపల్లి తహసీల్దార్‌కు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధులు చూసుకుని ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి ఒక్కడే కారులో బయల్దేరారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అవతలివైపు రోడ్డపై బోల్తాపడి పల్టీలు కొట్టడంతో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతయ్యారు. పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తహసీల్దార్‌ మృతి బాధాకరం   
అనంతపురం న్యూసిటీ: తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మృతి బాధాకరమని కలెక్టర్‌ వీరపాండియన్‌ పేర్కొన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహానికి కలెక్టర్‌ నివాళులర్పించారు. తహసీల్దార్‌ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అధికారులు ప్రయాణాలు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తుంచుకుని ముందుకెళ్లాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌ఓ సుబ్బారెడ్డి, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, సీసీలు భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు