ఈఎంఐలు చెల్లించలేక దంపతుల దుర్మార్గం..

10 Dec, 2019 18:29 IST|Sakshi

ముంబై : టీవీలో ప్రసారమయ్యే నేర వార్తల ప్రభావంతో ఓ జంట తమ పొరుగింటి వృద్ధురాలిని చంపి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన కలకలం రేపింది. థానేలో జరిగిన ఈ దారుణ ఘటనలో వృద్ధురాలిని చంపి విలువైన వస్తువులను కాజేసిన దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భివండి జిల్లా వధునవ్గర్‌ ప్రాంతంలో నవంబర్‌ 22న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్‌మార్టం​నిర్వహించగా వృద్ధురాలిని పదునైన ఆయుధంతో గట్టిగా తలపై కొట్టడంతో మరణించినట్టు గుర్తించారు. మృతదేహాన్ని 70 ఏళ్ల సోనూభాయ్‌దిగా ఆమె కుమారుడు గుర్తించడంతో హత్య కేసును చేధించేందుకు పోలీసులకు బలమైన ఆధారం లభ్యమైంది. 

తొలుత వృద్ధురాలి ఇంటి నుంచి ఆమె మృతదేహం పడవేసిన ప్రాంతం వరకూ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినా పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాలేదు. సోనుభాయ్‌ పొరుగున ఉన్న దంపతులపై అనుమానంతో వారిని తమదైన శైలిలో ప్రశ్నించిన ఖాకీలు కీలక విషయం రాబట్టారు. ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించేందుకు సోనుభాయ్‌ను తామే హత్య చేశామని వారు అంగీకరించారు. చిరుద్యోగులైన తాము ఇటీవల ఏసీ, కారు, ఐఫోన్‌ వంటి పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశామని, వాటి ఈఎంఐలను చెల్లించలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టామని చెప్పారు. సోనుభాయ్‌కు పెద్దమొత్తంలో పెన్షన్‌ వస్తుండటంతో ఆమె బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టు తెలుసుకుని వాటిని చేజిక్కించుకునేందుకే ఆమెను హత్య చేశామని వారు వెల్లడించారు. టీవీల్లో ప్రసారమయ్యే నేర వార్తల సీరియల్స్‌ క్రైమ్‌ పెట్రోల్‌, సావధాన్‌ ఇండియా వంటి షోలను చూసి తమకు హత్య ఆలోచన మొలకెత్తిందని ఆ దంపతులు చెప్పడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు