థియేటర్‌లోని క్యాంటీన్‌ సీజ్‌

31 Mar, 2018 10:34 IST|Sakshi
పురుగులు పట్టిన వెజిటబుల్‌ కట్‌లెట్‌ బొద్దింకలు, సన్న పురుగు పట్టిన దృశ్యం , ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ తనిఖీ చేస్తున్న పూర్ణచంద్రరావు

నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించిన అధికారులు

కాలం చెల్లనున్న కూల్‌డ్రింక్స్‌

నిల్వలు వెనక్కు తీసుకోవాలని కంపెనీకి నోటీసులు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా, లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్న అన్నపూర్ణ థియేటర్‌లోని క్యాంటీన్‌ను అధికారులు సీజ్‌ చేశారు. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా లేవంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌ లేకుండా క్యాంటీన్‌ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలిందని పూర్ణచంద్రరావు తెలిపారు. మినిట్‌ మెయిడ్‌ పల్ప్‌ డ్రింక్‌ బాటిల్స్‌కు 4, 5 రోజుల్లో కాలవ చెల్లనున్నట్లు గుర్తించామన్నారు.

వెజిటబుల్‌ కట్‌లెట్‌ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టిందని తెలిపారు. బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. లేస్, పాప్‌కార్న్‌ అన్‌ఆథరైజ్డ్‌ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వైట్‌ కవర్స్‌లో ఉంచిన కంపెనీ పేరులేని ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. క్యాంటీన్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. క్యాంటీన్‌లో లభించిన బ్యాచ్‌కు చెందిన కూల్‌ డ్రింక్స్‌ ఎక్కడెక్కడ నిల్వలున్నాయో.. వాటన్నింటిని స్వాధీనం చేసుకోవాలని కోకాకోలా కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. క్యాంటీన్‌కు సరుకు సరఫరా చేసే వారికి లైసెన్స్‌ లేదని తనిఖీల్లో వెల్లడైందన్నారు. శాంపిల్స్‌ నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్‌ లేకుండా సరుకు సరఫరా చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు