బంగారం షాపులో చోరీ  

26 May, 2018 12:06 IST|Sakshi
చోరీ జరిగిన దుకాణంలో విచారిస్తున్న ఎస్పీ

46 తులాల వెండి ఆభరణాలు

4కిలోల బంగారు అపహరణ

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి

మరిపెడ :  మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఓ జ్యూలరీ షాపులో చోరీ జరి గింది. బాధితుడు,  పోలీసుల కథనం ప్రకా రం.. మునవర్‌ నాగేశ్వరరావుకు మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనగల రామవిలాస్‌ వీధిలో శ్వేత జ్యూలరీ షాపు ఉంది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి గడ్డపారలతో దుకాణం షెట్ట ర్‌ను పైకి లేపి దోపిడీకి పాల్పడ్డారు.

46తులాల వెండి, 4కిలోల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించారు. వీటి విలువ రూ. 15.10లక్షలు ఉంటుంది. అంతేకాకుండా షాపులో ఏర్పాటుచేసిన సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. 

దొంగలను పట్టుకుంటాం.. 

వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.  మరిపెడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం వద్దకు పోలీస్‌ జాగిలాలను రప్పించి పరిశీలించారు. కాగా, ఇదే ప్రాంతంలో ఉన్న మరో సీసీ కెమెరాలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బంగారు దుకాణంలోకి చొరబడుతున్నట్లు కనిపిస్తుందన్నారు.

వీటికి  సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి  గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం వద్ద రోడ్డు పక్కన చోరీ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని ఖాళీబాక్స్‌లు, చోరీకి ఉపయోగించిన గడ్డపారలు పడేసినట్లు గుర్తించామన్నారు. ఆయనతో పాటు తొర్రూర్‌ డీఎస్పీ రాజారత్నం, మరిపెడ సీఐ ఇస్లావత్‌ శ్రీనివాస్, ఎస్సైలు పవన్‌కుమార్, మద్దెల ప్రసాద్‌రావు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు