11 రాష్ట్రాలు.. 17 నగరాలు.. 30 చోరీలు

20 Mar, 2018 02:18 IST|Sakshi

చిట్టా విప్పుతున్న పార్క్‌ హయత్‌ దొంగ  

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లోకి దర్జాగా ప్రవేశించి నూతన జంట బస చేసిన గదిలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడి అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. పార్క్‌హయత్‌ చోరీకి పాల్పడిన జయేశ్‌ రావ్‌జీ సేజ్‌పాల్‌(45)ను బంజారాహిల్స్‌ పోలీసులు ముంబైలోని థానే రైల్వే స్టేషన్‌లో అరెస్ట్‌ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జోడియా ప్రాంతానికి చెందిన జయేశ్‌ ఈ నెల 6న రాత్రి పార్క్‌హయత్‌ హోటల్‌లోకి ప్రవేశించి హిమాయత్‌నగర్‌కు చెందిన యువ వ్యాపారి వెంకట్‌ కోనారావుకు చెందిన బంగారు ఆభరణాలు తస్కరించిన విషయం తెలిసిందే. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని దర్యాప్తులో తేలింది.

నిందితుడు దేశంలోని 11 రాష్ట్రాల్లో 17 నగరాల్లోని పలు స్టార్‌ హోటళ్లలో ప్రవేశించి 30 దొంగతనాలు చేసినట్లు తేలింది. గత 20 సంవత్సరాలుగా స్టార్‌ హోటళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి చోరీని ప్రారంభించిన నిందితుడు హైదరాబాద్‌లో మూడు హోటళ్లలో, విశాఖపట్నంలో నోవాటెల్‌ హోటళ్లలో దొంగతనాలు చేశాడు. 

మరిన్ని వార్తలు