పట్టపగలే దోచేశారు

24 Aug, 2019 12:12 IST|Sakshi

జిల్లా కేంద్రంలో దొంగల హల్‌చల్‌ 

తాళం వేసిన నాలుగిళ్లలో చోరీ 

15 తులాల బంగారం, 1.39 లక్షల నగదు అపహరణ 

సాక్షి, కామారెడ్డి :  జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు కలకలం సృష్టించారు. తాళం వేసిన నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నేతాజీ రోడ్‌లో అంజయ్య అనే కూరగాయల వ్యాపారి ఇల్లు ఉంది. అదే ఇంట్లో వెనుకభాగంలో సంగి శ్రీనివాస్‌ అనే రేషన్‌డీలర్‌ అద్దెకు ఉంటున్నాడు. వీరంతా శుక్రవారం ఉదయం ఎవరి పనుల మీద వారు వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు.. తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సామాన్లన్నీ చిందరవందర చేశారు. 7 తులాల బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారని అంజయ్య తెలిపారు. తన ఇంట్లోనుంచి నాలుగు తులాల బంగారం, రూ.15 తులాల వెండి, రూ.9 వేల నగదు ఎత్తుకెళ్లారని సంగి శ్రీనివాస్‌ తెలిపారు.  

టీచర్స్‌ కాలనీలో.. 
నేతాజీ రోడ్‌ పక్కనే టీచర్స్‌ కాలనీ ఉంది. ఓ ఇంట్లో గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఎండీ దిల్‌దార్‌ఖాన్‌ అద్దెకు ఉంటున్నాడు. మనవడికి జ్వరం వచ్చిందని ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, 70 వేల రూపాయలు ఎత్తుకెళ్లారని దిల్‌దార్‌ఖాన్‌ తెలిపారు. అలాగే అశోక్‌నగర్‌ కాలనీలో చర్చికంపౌండ్‌లోని ఓ ఇంట్లో లలితరాణి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. 2 తులాల బంగారం, రూ. వెయ్యి అపహరించుకువెళ్లారు.  

వెంటిలెటర్‌ పగులగొట్టి..
టీచర్స్‌ కాలనీలో దిల్‌దార్‌ఖాన్‌ ఇంట్లోకి దొంగలు ఇంటి మెట్ల పక్కన ఉండే బెడ్‌రూంలోని అటాచ్‌ బాత్‌రూమ్‌కు సంబంధించిన వెంటిలెటర్‌ను పగులగొట్టి లోపలికి దూరారు. ఆ తర్వాత గునపంతో బీరువాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. పక్కింటి వారికి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు వెంటిలెటర్లను దుప్పట్లతో కప్పారు.  

మధ్యాహ్నం 1.30 గంటల నుంచి.. 
నాలుగిళ్లలో కలిపి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.39 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఈ చోరీలన్నీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాలను పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సైలు గోవింద్, రవికుమార్‌ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో వివరాలను సేకరించారు. 

మరిన్ని వార్తలు