రోజుకూలీ రాజప్ప.. ఇతను సామాన్యుడు కాదప్పా!!

31 Jan, 2018 12:32 IST|Sakshi
పోలీసుల అదుపులో రాజప్ప

బెంగళూరు : ఫొటోలోని వ్యక్తి పేరు రాజప్ప. బాహుబలిలో కట్టప్ప కంటే ఎక్కువ వినయాన్ని ప్రదర్శిస్తాడు. రోజు కూలీనని, ఏమీ లేనివాడినని చెప్పుకుంటాడు. ఒకప్పుడది నిజమే. కానీ ఇప్పుడతను కోటీశ్వరుడు! పెద్ద నోట్ల రద్దును అనకూలంగా మార్చుకున్న అక్రమార్కుల్లోఒకడు!! తాను నివసించే ఖరీదైన ఇంట్లో 27 కిలోల గంజాయి మూటలతో అడ్డంగా దొరికిపోయిన రాజప్పను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని గురించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

రోజు కూలీగా జీవితాన్ని ఆరంభించి.. : దక్షిణ కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌ జిల్లాకు చెందిన పేద రాజప్ప చాలా ఏళ్ల కిందటే బెంగళూరు నగరానికి వలస వచ్చాడు. భవన నిర్మాణంలో రోజు కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటూ కాలం గడిపేవాడు. రాజప్ప సొంత ఊరు గంజాయి సాగుకు చాలా ఫేమస్‌. ఇంటికి వెళ్లినప్పుడల్లా సరదాగా కొంత గంజాను తీసుకొచ్చి తక్కువ ధరకే తోటి కూలీలకు ఇచ్చేవాడు. క్రమంగా వారంతా ఆ మత్తుపదార్థానికి బానిసలయ్యారు. గంజాయి సప్లయర్‌గా రాజప్పకు డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు గ్రాముల్లో మొదలైన స్మగ్లింగ్‌ క్రమంగా టన్నులకు చేరింది. ఎడాపెడా గంజాయి అమ్మేసి కోట్లు గడించాడు రాజప్ప. ఎప్పటి నుంచో కన్నేసిన పోలీసులు.. ఇటీవలే రాజప్ప ఇంటిపై దాడిచేసి పక్కా సాక్ష్యాదారాలతో కేసు నమోదుచేశారు.

నోట్లరద్దుతో ప్రముఖుడయ్యాడు : గంజాయి కేసులో అరెస్టైన రాజప్పను పోలీసులు విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దందాలో పోగేసిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని నోట్ల రద్దు తర్వాత తెల్లధనంగా మార్చుకున్నాడు రాజప్ప. అందుకోసం న్యాయవాదులు, బినామీలు, అకౌంటెంట్లతో భారీ సెటప్‌ చేసుకున్నాడు. నోట్ల రద్దు తర్వాత రాజప్ప అకౌంట్‌లో నిల్వలు భారీగా పెరగడంపై ఐటీ శాఖ వివరణ కోరగా.. నకిలీ పత్రాలు చూపించి తప్పించుకున్నాడు. అరెస్టు తర్వాత అసలు నిజం వెలుగులోకి రావడంతో అతనిపై చర్యలకు ఐటీ శాఖ సిద్ధమైంది. గంజాయి కేసు నిరూపణ అయితే రాజప్పకు భారీ శిక్ష తప్పదు. ప్రస్తుతం అతను జ్యుడిషిల్‌ రిమాండ్‌ ఉన్నాడు.

మరిన్ని వార్తలు