బస్టాండ్‌ సెంటిమెంట్‌

25 Jul, 2018 12:19 IST|Sakshi
కూచిపూడి లక్ష్మణ్‌

దొంగతనం చేసి ఇమ్లీబన్‌లో నిద్రిస్తాడు    

బస్టాండ్‌లోనే అరెస్ట్‌

బంజారాహిల్స్‌: ఎవరైనా దొంగతనం చేయగానే ఏం చేస్తారు..? దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్‌ వదిలి పోలీసుల కంటపడకుండా మరోచోటికి మకాం మారుస్తారు. అయితే ఘరానా దొంగ లక్ష్మణ్‌ రూటే సెపరేటు. దొంగతనం చేయగానే ఆ సొమ్మును భద్రంగా మూటగట్టుకొని ఇమ్లిబన్‌ బస్టేషన్‌లో ఓ పక్కన దుప్పటి కప్పుకొని నిద్రిస్తాడు. ఆ తెల్లవారే తీరిగ్గా మరో చోటకు వెళ్తాడు. బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసిన దొంగ కూచిపూడి లక్ష్మణ్‌ అలియాస్‌ లక్ష్మణ్, అలియాస్‌ మున్నా, అలియాస్‌ మధు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, షేక్‌ మహ్మద్‌పేట గ్రామానికి చెందినవాడు. నగరానికి వలస వచ్చిన అతను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ మాదా పూర్‌ ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ఇటీవల అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దొంగతనానికి వెళ్లేముందు లక్ష్మణ్‌ ఇమ్లిబన్‌ బస్‌ స్టేషన్‌లో నే పగలంతా ఓ పక్కన దుప్పటి కప్పుకొని పడుకుని, రాత్రి 9 గంటలకు చోరీకి బయల్దేరతాడు. అర్ధరాత్రి దోచుకున్న సొమ్మును మూటగట్టుకొని మళ్లీ ఇమ్లిబన్‌ బస్‌ స్టేషన్‌కే వచ్చి పడుకుంటాడు. ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నట్లు తెలిపాడు . దొంగతనం చేసిన తెల్లవారి నగరం నుంచి మకాం మార్చేస్తాడు. శ్రీకృష్ణదేవరాయనగర్‌లోని వ్యాపా రి గోవింద్‌ ఇంట్లో చోరీ చేసిన లక్ష్మణ్‌ తాళం పగలగొట్టేందుకు తన వెంట తెచ్చుకున్న రాడ్, స్క్రూడ్రైవర్‌ అక్కడే వదిలేయడంతో వాటిపై ఉన్న వేలిముద్రల ఆధారంగా మూడు రోజుల క్రితం ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌లో అతడిని అరెస్ట్‌ చేశా రు. ఆ రోజు రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లో ఓ దొంగతనానికి సమయాత్తమవుతూ పోలీసులకు దొరక డం గమనార్హం.  కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అతను గత మే నెల 10న విడుదలయ్యాడు. రెండు వారాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. కూకట్‌పల్లి,మియాపూర్, ఎస్‌ఆర్‌నగర్, కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 31 దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు