తెల్లవారుజామునే పంజా!

27 Jul, 2018 12:05 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు

16 ఏళ్ల వయస్సు నుంచి దొంగతనాలు

పీడీ యాక్ట్‌ ప్రయోగించినా మారని తీరు

అరెస్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌కు చెందిన షారూఖ్‌ తెల్లవారుజామునే  చోరీలు చేస్తుంటాడు. ఇంట్లో ఉన్న బంగారం, సెల్‌ఫోన్లు మాత్రమే తీసుకుని ఉడాయిస్తాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. ఈ పంథాలో ఏడేళ్లుగా నేరాలు చేస్తున్న షారూఖ్‌ మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధుల్లో జరిగిన చోరీలకు సంబంధించి అతడితో పాటు అనుచరుడినీ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు అదనపు డీసీపీ చైతన్యకుమార్‌ గురువారం వెల్లడించారు. చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ షారూఖ్‌ (23) వేరు పడటంతో అతడిపై పర్యవేక్షణ కొరవడింది.  దీంతో జల్సాలకు బానిసైన అతడికి ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కోసం  16వ ఏటనే దొంగగా మారాడు. తల్లిదండ్రులకు దూరమైన షారూఖ్‌ పాతబస్తీలోని కొందరి ఇళ్లల్లో ఆశ్రయం పొందుతూ వారికి కొంత చెల్లిస్తుంటాడు. తెల్లవారుజామున కాలనీల్లో తిరుగుతూ తలుపులకు లోపల నుంచి బోల్టులు పెట్టని ఇళ్లను గుర్తిస్తాడు.

యజమానులు గుర్తించకుండా వాటిలోకి ప్రవేశించే షారూఖ్‌ కేవలం బంగారం, సెల్‌ఫోన్లు మాత్రమే తస్కరిస్తాడు. వీటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో మద్యం, మాదకద్రవ్యాలు, వ్యభిచారం వంటి జల్సాలు చేస్తాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయాక మరో నేరం చేస్తాడు. ఇలా 2011 నుంచి ఇతడిపై 23 కేసులు నమోదయ్యాయి. 2015లో సంతోష్‌నగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపారు. బయటికి వచ్చినా తన పంథా మార్చుకోని షారూఖ్‌ బహదూర్‌పుర పరిధిలో మరో చోరీ చేసి ఈ ఏడాది ఏప్రిల్‌ 9న అరెస్టు అయ్యాడు. ఈ కేసులో గత నెలలో బయటకు వచ్చిన తర్వాత తలాబ్‌కట్టకు చెందిన మరో ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ మజర్‌తో కలిసి ముఠా కట్టాడు. వీరిద్దరూ నెల రోజుల్లో నగరంలోని చిలకలగూడ, ఉస్మానియా వర్శిటీతో పాటు సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఆరు చోరీలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, జి.వెంకటరామిరెడ్డి, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, మహ్మద్‌ థకుద్దీన్‌ వలపన్ని గురువారం పట్టుకున్నారు. వీరి నుంచి 150 గ్రాముల బంగారం, 130 గ్రాముల వెండి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు