ఈ దొంగోడి రూటే సపరేటు

16 Apr, 2019 10:58 IST|Sakshi
చోరీ సొత్తును పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, నిందితుడు మునిరాజు

గ్రామంలో ఎవరైనా చనిపోతే అక్కడ వాలిపోతాడు  

బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తూ చేతివాటం  

అనుమానం రాకుండా చోరీల్లో దిట్ట

కర్ణాటక, కృష్ణరాజపురం : నేరాలను అదుపు చేయడానికి, నేరస్థులను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ఎన్ని పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నా నేరస్థులు వాటిని మించిపోయే రీతిలో సరికొత్త ఎత్తుగడలతో నేరాలకు పాల్పడుతున్నారు. సోమవారం హొసకోటె పోలీసులు అరెస్ట్‌ చేసిన దొంగ కేడీ ఇదేకోవకు చెందుతాడు. శ్రీరామపుర ప్రాంతానికి చెందిన మునిరాజు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ అందినకాడికి నగదు, నగలు దోచుకొని ఉడాయించేవాడు. అయితే చోరీ చేయడానికి నిందితుడు ఎంచుకున్న మార్గం తెలుసుకొని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హొసకోటెతో పాటు చుట్టుపక్కల తాలూకాల గ్రామాల్లో సంచరించే మునిరాజు ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడ వాలిపోతాడు.

మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తాను కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ ఇంట్లో కలియతిరుగుతాడు. అంత్యక్రియలు నిర్వహించడానికి మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు స్మశానాలకు వెళ్లగానే మునిరాజు తన పని మొదలుపెడతాడు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఇంట్లో తిరుగుతూనే అదును చూసి ఇంట్లో ఉన్న నగదు, నగలు తస్కరించేవాడు. అనంతరం అక్కడి నుంచి మెల్లిగా జారుకునేవాడు. ఇలా హొసకోటెతో పాటు నెలమంగల తదితర ప్రాంతాల్లో తొమ్మిదికి పైగా ఇళ్లల్లో చోరీలు చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న అవలహళ్లి పోలీసులు సోమవారం నిందితుడు మునిరాజును అరెస్ట్‌ చేసి రూ.26.70 లక్షల విలువ చేసే 886 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు