ఘరానా దొంగ అరెస్ట్‌

24 Jul, 2018 13:05 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా పలు చోరీలు  

చోరీ బంగారం తనఖాపెట్టి ఆ నగదుతో జల్సాలు  

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడడంతోపాటు బైక్‌లు ఎత్తుకుపోతున్న ఘరానా దొంగను ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తులం బంగారం, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కంచరపాలెం నేర విభాగం పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ ఏఆర్‌ దామోదర్‌ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి పొన్నాడ రవిశంకర్‌ అలియాస్‌ వీరబాబు(28) వరుస జల్సాల కోసం చోరీల బాటపట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నాడు. ఇప్పటి వరకు విశాఖపట్నంతోపాటు విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో 23కు పైగా కేసులు నమోదయ్యాయి.

ఏడాది కాలంగా ఎయిర్‌ పోర్ట్‌ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు దొంగతనాలు, కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకటి, గోపాలపట్నం పరిధిలో మూడు చోట్ల, ఆరిలోవలో రెండు చోట్ల, పద్మనాభంలో మూడు చోట్ల, అచ్చుతాపురంలో ఒక చోట, ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఒకటి, రెండో పట్టణ పీఎస్‌ పరిధిలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. అదేవిధంగా పార్కింగ్‌ చేసి ఉన్న బైక్‌లను కూడా ఎత్తకుపోయేవాడు. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరబాబుపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో కాకానినగర్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎయిర్‌ పోర్ట్‌ నేర విభాగం ఎస్‌ఐ ఎ.మన్మథరావు, వెస్ట్‌ జోన్‌ సీఐ నల్లి సాయి అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి తులం బంగారంతోపాటు నాలుగు బైక్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. అయితే భారీ దొంగతనాలకు పాల్పడినప్పటికీ తులం బంగారమే లభ్యం కావడం, నగదు దొరక్కపోవడంతో పోలీసులు లోతుగా విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. చోరీ చేసిన బంగారాన్ని ఎప్పటికప్పుడు ప్రైవేటు సంస్థల్లో తనఖా పెట్టి ఆ నగదుతో జల్లాలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ బంగారం రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ తెలిపారు. సమావేశంలో నేర విభాగం ఏసీపీ ఫల్గుణరావు, వెస్ట్‌ జోన్‌ ఏసీపీ అంక అర్జున్‌ రావు, కంచరపాలెం సీఐ చంద్రశేఖరరావు, కంచరపాలెం నేర విభాగం ఎస్‌ఐ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు