దేవుడి నగలే టార్గెట్‌..!

19 May, 2018 04:16 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆభరణాలను పరిశీలిస్తున్న అర్బన్‌ ఎస్పీ, (ఇన్‌సెట్‌లో) నిందితుడు రాంబాబు

     దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న గజదొంగ అరెస్ట్‌

     రాష్ట్రవ్యాప్తంగా 76 ఆలయాల్లో దేవుళ్ల సొమ్ము స్వాహా

     గుంటూరు జిల్లాలో 17 కేసులు 

     238 గ్రాముల బంగారు నగలు.. 6.2 కేజీల వెండి స్వాధీనం

సాక్షి, గుంటూరు: దేవుడికి అలంకరించిన నగలను టార్గెట్‌ చేస్తూ దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ గజదొంగను గుంటూరు అర్బన్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌.విజయరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నగరంలోని అరుంధతీ నగర్‌లో నివసిస్తున్న ఈమని రాంబాబు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం 2014 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అయితే ఇతను దేవాలయాల్లో తప్ప మరెక్కడా దొంగతనాలు చేసేవాడు కాదు.

గుంటూరు అర్బన్‌ జిల్లా పరిథిలోని దేవాలయాల్లో జరిగిన వరుస దొంగతనాలపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్‌ ఎస్పీ విజయరావు డీఎస్పీ దేవరకొండ ప్రసాద్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గోరంట్ల ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని చిల్లీస్‌ దాబా వద్ద పల్సర్‌ మోటారు వాహనంపై బ్యాగుతో అనుమానస్పదంగా తిరుగుతున్న రాంబాబును అదుపులోకి తీసుకుని సోదా చేయగా, బ్యాగులో దేవాలయాల్లో ఉపయోగించే వెండి, పూజా వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ జరుపగా, దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వైనాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో రాంబాబును అరెస్టు చేసి రూ.12 లక్షల విలువ చేసే 238 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, 6.2 కేజీల వెండి పూజా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీసీఎస్‌ సీఐ షేక్‌ అబ్దుల్‌ కరీం, ఇతర సిబ్బందిని ఎస్పీ  క్యాష్‌ అవార్డులు ప్రకటించారు. 

దొంగతనాలకు పాల్పడింది ఇలా...
దేవాలయాల్లో చోరీకి పాల్పడే ముందు రాంబాబు రెక్కీ నిర్వహించేవాడు. ఉదయం 5.30 గంటల నుంచి 10  వరకు దేవాలయంలో పరమభక్తుడి మాదిరిగా వెళ్లి పూజలు చేసి పూజారితో మాటలు కలిపి దక్షిణలు ముట్టజెప్పేవాడు. రూ.100 నుంచి రూ.500 నోటును కానుకల పళ్లెంలో వేసి పూజారిని రూ.50 తీసుకుని మిగిలిన చిల్లర తీసుకు రమ్మని బయటకు పంపేవాడు. తదుపరి గుడిలో ఎవరూ లేని సమయంలో దేవుళ్లకు అలంకరించిన బంగారు, వెండి వస్తువులను దొంగిలించి పరారయ్యేవాడు.  

>
మరిన్ని వార్తలు