రైతు బంధు సాయం చోరీ..

30 May, 2018 10:30 IST|Sakshi
తలారి శ్రీనివాస్‌

నిందితుడి అరెస్టు

బషీరాబాద్‌(తాండూరు) : ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ఇచ్చిన రైతుబంధు సాయం ఓ మహిళా రైతు ఇంట్లో చోరీకి గురైంది. ఈ సంఘటన బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దామర్‌చెడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాలెల లక్ష్మీ భర్త చనిపోవడంతో చాలా ఏళ్లుగా వ్యవసాయం చేస్తుంది. అయితే ఈ మధ్యే రైతు బంధు పథకం ద్వారా రూ.11,900 వచ్చాయి. కొన్ని నెలల కిందట గ్రామంలోని కొంతమంది రైతులకు అప్పుగా రూ.78,100 ఇచ్చింది.

వారికి కూడా రైతుబంధు సాయం అందడంతో సదరు రైతులు అప్పు చెల్లించారు. ఈ మొత్తం డబ్బును ఇంట్లో దాచిపెట్టింది. హైదరాబాద్‌లో ఉన్న తన కొడుకును చూడడానికని ఈ నెల 24న లక్ష్మీ ఇంటికి తాళం వేసి వెళ్లింది. తిరిగి ఈ నెల 26న ఇంటికి చేరుకొని చూడగా ఇంట్లో దాచిన రూ.90 వేల నగదు కనిపించలేదు. దీంతో డబ్బులు అప్పుగా అడిగిన పొరుగింటి యువకుడు తలారి శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన ఎస్సై లక్ష్మయ్య 48 గంటల్లోన్నే కేసును చేదించారు. అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నేరాన్ని అంగీకరించాడు. తనకు అప్పు అడిగితే ఇవ్వనందుకే చోరీకి పాల్పడినట్లు చెప్పాడు. అతడి నుంచి రూ.68,500 రికవరీ చేసిన పోలీసులు, మరో 21,500 ఖర్చు చేశాడని వెల్లడించారు. మంగళవారం యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు