ఇంటికి కన్నం వేసిన పని మనిషి అరెస్ట్‌

5 Jun, 2018 08:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి 

అత్తాపూర్‌ : నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అని ఇంటి పనులన్నీ అప్పజెప్పారు. అదే అదనుగా భావించిన ప్రబుద్ధుడు పని చేస్తున్న ఇంటికే కన్నం పెట్టాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పో లీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన నగర శి వారులోని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట మండలం కిస్మత్‌పూర్‌ గ్రామంలోని ప్రెస్టేజ్‌ రాయల్‌ విల్లాస్‌ లోని 56వ ప్లాట్‌లో గత కొంతకాలంగా డాక్టర్‌ రా మకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.

అయితే భార్యాభర్తలు ఉద్యోగులు కావడంతో ఇంట్లో వంట చేయడానికి తమకు తెలిసిన బంధువుల ద్వారా ఉప్పల్‌ ప్రాంతంలో ఉంటున్న రవి అనే వ్యక్తిని ఫిబ్రవరి మాసంలో వంట మనిషిగా పెట్టుకున్నారు. అదే అదనుగా భావించిన రవి.. దంపతులిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో బీరువాలో ఉన్న 51 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును దోచుకోని పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పని మనిషి రవికి ఫోన్‌ చేస్తే స్వీఛాప్‌ వచ్చింది.

దీంతో అతనిపై అనుమానంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్‌ పోలీసులు, శంషాబాద్‌ జోన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, డిటెక్టివ్‌ ఆఫీసర్‌ అశోక్‌కుమర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు