దొంగల కుటుంబం

18 Jan, 2019 11:36 IST|Sakshi
మహ్మద్‌ సలీమ్‌, షమా ,పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు నగలు

కోయంబత్తూరులో దోపిడీ తల్లీ కొడుకు అరెస్ట్‌

తిరుపతిలో నగలు అమ్మేందుకు యత్నం

రూ.60.51లక్షల విలువ చేసే బంగారు, డైమండ్

వెండి ఆభరణాలు స్వాధీనం

నిందితురాలి కుమారులపై తమిళనాడులో ఎర్రచందనం కేసులు

చిత్తూరు, తిరుపతి క్రైం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వద్ద దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసి వారి నుంచి సుమారు 60, 51,400 రూపాయల విలువగల బంగారు, డైమండ్, వెండి ఆభరణాలను తిరుపతి సీసీఎస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం సబ్‌ డివిజన్‌ డీఎస్పీ ఆర్‌.రవిశంకర్‌రెడ్డి కథనం...ఈనెల 7న కోయంబత్తూరు వద్ద దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 1965.530 గ్రాముల బంగారు, 15.140 గ్రాముల డైమండ్‌ నగలు, 248.200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. తమిళనాడులో దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, గురువారం తెల్లవారుజామున తిరుపతి టీటీడీ శ్రీకోదండరామస్వామి ధర్మశాల 3వ సత్రం ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న ఒక మహిళ, యువకుడిని తిరుపతి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సి.భాస్కర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో వారిద్దరూ తల్లీకొడుకులని,  తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పంజన్‌ తంగాళ్‌ రోడ్డు, జీఆర్‌ నగర్‌కు చెందిన రసూల్‌ భార్య షమా(46), ఆమె కుమారుడు మహమ్మద్‌ సలీం(29) అని తేలింది. అంతేకాకుండా వారి వద్ద నున్న నల్లటి బ్యాగులను తెరచి పరిశీలించగా లక్షల విలువ చేసే బంగారు, డైమండ్, వెండి నగలు ఉండటంతో విస్తుపోయారు! వీళ్లు ఘరానా దొంగలనే కోణంలో విచారణ చేసేసరికి దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. షమా ఇద్దరు కుమారులు మహ్మద్‌ సలీం, ఫైరోజ్‌ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారిద్దరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు గుర్తించారు. షమా తన చిన్నకుమారుడు, తన స్నేహితులతో కలసి కోయంబత్తూరులో దోపిడీకి పాల్పడి ఈ నగలు కాజేసినట్టు వెల్లడైంది. ఈ నగలు ఇంటి వద్ద దాచి ఉంచినపక్షంలో తమిళనాడు పోలీసులు గుర్తించి పట్టుకుంటారనే ఉద్దేశంతో తన పెద్దకొడుకుతో కలిసి రెండుమూడు రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో ఉంటున్నట్టు షమా నోరువిప్పింది. ఈ నగలను తిరుపతిలో విక్రయించి వెళ్లాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ ఘటన సమాచారాన్ని కోయంబత్తూరు జిల్లా కేజీ చావిడి పోలీసు స్టేషన్‌కు తిరుపతి పోలీసులు చేరవేశారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వివిధ చోట్ల దోపిడీ చేసిన∙సొత్తును బాధితులకు అప్పగించనున్నట్టు డీఎస్పీ ఆర్‌.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు భాస్కర్‌రెడ్డి, కె.శరత్‌చంద్ర, టి.అబ్బన్న, ఎస్‌ఐ డి.రమేష్‌ బాబు, హెడ్‌కానిస్టేబుల్‌ రాజేంద్ర, ఆర్‌.పద్మావతి, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్, బారుసా, రవికుమార్, రెడ్డెమ్మను తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు. వీరికి రివార్డులను సిఫారసు చేశారు.

మరిన్ని వార్తలు