వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

22 Nov, 2019 18:50 IST|Sakshi

సాక్షి , హైదరాబాద్‌ : ఒక దొంగ దర్జాగా గుడి లోపలికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన మన హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలోనే బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా దొంగ చేసిన పని సీసీ కెమెరాలో రికార్డవడం అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దొంగతనం చేసే ముందు ఆ వ్యక్తి చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్‌ ప్రాంతంలో ఉన్న దుర్గ గుడికి బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు.

ఆ వ్యక్తి వచ్చిన సమయంలో గుడిలో  ఎవరు లేరు. ఇదే అదనుగా భావించిన సదరు దొంగ కిరీటాన్నీ ఎత్తుకెళ్లాలని భావించాడు. అయితే కిరీటాన్ని దొంగలించడానికి ముందు తనను క్షమించాలంటూ ప్రదర్శనలు చేసి దేవతను ప్రార్థించి కొన్ని గుంజీలు తీశాడు. తరువాత తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టు పక్కల చూశాడు. ఎవరు చూడట్లేదని నిర్థారించుకొని మెళ్లిగా కిరీటాన్ని తీసి తన షర్టులోకి దోపుకున్నాడు. మళ్లీ ఎప్పటిలాగే ఎవరికి ఏ అనుమానం రాకుండా బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యడు.

గురువారం ఉదయం యధావిధిగా గుడికి వచ్చిన పూజారి విగ్రహానికి కిరీటం లేకపోవడాన్ని గమనించాడు. దీంతో వెంటనే మేనేజర్‌కు తెలపగా అతను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిక్షించి దొంగ చేసిన పనికి అవాక్కయ్యారు. దొంగపై సెక‌్షన్‌ 380 కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. దేవుడి సొమ్మును ఎత్తుకెళ్తున్నందుకు తనకు ఏ పాపం తగలకూడదనే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా