రమోల్‌లో సెకండ్‌ ఆపరేషన్‌

24 Mar, 2018 07:52 IST|Sakshi
రమోల్‌ సమీపంలోని టోల్‌ప్లాజా

అహ్మదాబాద్‌ సరిహద్దుల్లో పోలీసుల రెండో ‘పర్యటన’

2010లో టీజీఐ ఉగ్రవాది వికార్‌ అహ్మద్‌ డెన్‌ కోసం

తాజాగా దొంగ జగదీష్‌ అరెస్టు సైతం ఆ ప్రాంతంలోనే

సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సరిహద్దుల్లో ఉన్న రమోల్‌ ప్రాంతం... అఫ్జల్‌గంజ్‌ ఠాణా పరిధిలోని ప్రిన్స్‌ పేపర్‌ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేసిన ‘మాజీ ఇంటి దొంగ’ జగదీష్‌ గిరి అక్కడే చిక్కాడు. హైదరాబాద్‌కు సంబంధించి ఆ ప్రాంతంలో పోలీసు ఆపరేషన్‌ జరగడం ఇది రెండోసారి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్‌ అహ్మద్‌ కేసు దర్యాప్తులో అక్కడే ఓ సెర్చ్‌ ఆపరేషన్‌ సాగింది. ఇప్పుడు జగదీష్‌ కోసం రెండోది జరిగింది. జగదీష్‌ అరెస్టు ఆపరేషన్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ గురువారం మీడియాకు వెల్లడించిన విషయం విదితమే. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాకు చెందిన జగదీష్‌ గిరి తన స్నేహితుడైన ప్రవీణ్‌ సింగ్‌తో కలిసి ప్రిన్స్‌ పేపర్‌ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేశాడు. ఈ పని పూర్తయిన తర్వాత ఇద్దరూ ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తమ స్వస్థలానికి ప్రయనమయ్యారు. వారు అక్కడికి చేరుకునే లోపే కేసు దర్యాప్తులో భాగంగా జగదీష్‌ ద్వ యం కదకలను గుర్తించిన అఫ్జల్‌గంజ్‌ పోలీసులు రమోల్‌ అధికారులను అప్రమత్తం చే యగా... అక్కడి టోల్‌ ప్లాజా వద్ద కాపుకాసిన రమోల్‌ పోలీసులు జగదీష్, ప్రవీణ్‌లను పట్టుకుని, నగ దు స్వాధీనం చేసుకున్నారు. నగరం నుం చి వెళ్లిన పోలీసులు వీరిద్దరినీ అక్కడి కోర్టులో హా జరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు.

మోదీ కోసం వికారుద్దీన్‌ అహ్మద్‌...
తెహరీక్‌ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన నగరవాసి వికార్‌ అహ్మద్‌ అలియాస్‌ వికారుద్దీన్‌ 2009–10ల్లో పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇతను అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని టార్గెట్‌ చేశాడు. గుజరాత్‌ అల్లర్లకు ప్రతీకారంగా, ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ మోదీనే హత్య చేయాలని కుట్రపన్నాడు. ఆ ఆపరేషన్‌ కోసం అహ్మదాబాద్‌ శివార్లలోని రమోల్‌ ప్రాంతంలో డెన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. తన అనుచరుడు డాక్టర్‌ హనీఫ్‌ ద్వారా పరిచయమైన ఆ ప్రాంత లోకల్‌ లీడర్‌ జుబేర్‌ ద్వారా గవర్నమెంట్‌ స్థలాన్ని కొని అందులో ఇంటిని నిర్మించాడు. మీడియా ప్రతినిధుల్లా మోదీని సమీపించి తుపాకులతో కాల్చి చంపాలని కుట్రపన్నాడు. దీని కోసం ఇమ్రాన్‌ఖాన్‌ పేరుతో జీ టీవీ, స్టార్‌ న్యూస్‌ రిపోర్టర్‌గా పేర్కొంటూ నాలుగు బోగస్‌ గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. రమోల్‌ పోలీసుస్టేషన్‌ ప్రారంభోత్సవానికి మోదీ వచ్చినప్పుడు, మరో రెండుసార్లు ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ నేపథ్యంలో తన వద్ద ఉన్న షార్ట్‌ వెపన్స్‌తో ఆపరేషన్‌ చేయడం కష్టమని వెనక్కుతగ్గాడు. 2010లో వికార్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు లు రమోల్‌ వెళ్లి అక్కడి వికార్‌ ఇంట్లో సోదాలు చేయగా, ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన మారణాయుధాల్లో మూడింటిని, ఓ ఎయిర్‌ పిస్టల్, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు