గోవిందరాజ స్వామి ఆలయ దొంగ అరెస్ట్‌

23 Apr, 2019 16:45 IST|Sakshi

తిరుపతి: రెండు నెలల క్రితం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి గురైన మూడు కిరీటాలను రికవరీ చేసినట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తిరుపతిలో ఎస్పీ అన్బురాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ... చోరీ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన ఆకాశ్‌ ప్రకాశ్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి బంగారు కడ్డీలు, ఒక ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు చోరీ చేసిన 3 కిరీటాలను కరిగించి బంగారు కడ్డీలుగా మార్చాడని తెలిపారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని, వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. చోరీ జరిగిన 80 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడు దొంగతనం చేశాక రేణిగుంట, కాచిగూడల్లో స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారుల వద్ద అమ్మటానికి ప్రయత్నించి విఫలమయ్యాడని వివరించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా,  ఓ వైన్‌షాప్‌ వద్ద ఉన్న సీసీ కెమెరా అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో నిందితుడు కనపడ్డానని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడి కదలికల ఆధారంగా వివిధ ప్రాంతాలకు టీంలను పంపించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు