అంతర్‌ జిల్లాల దోపిడీ ముఠా అరెస్టు

12 Apr, 2018 10:12 IST|Sakshi
రికవరీ చేసిన వస్తువులను పరిశీలిస్తున్న ఎస్పీ

రూ. 50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం 

కాకినాడ రూరల్‌: ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో వివిధ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను, బంగారం కొనుగోలు చేసిన నరసాపురానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి వీరి నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారు, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్పీ విశాల్‌ గున్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగతనాలకు పాల్పడిన ముఠా వివరాలను వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు 2015 నుంచి ఇప్పటి వరకు 18 దొంగతనాలు, 3 దోపిడీలు చేసినట్లు చెప్పారు.

వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారం, 37 కిలోల వెండి, రూ. 3, 04, 700 నగదుతో కలిపి మొత్తం రూ. 50 లక్షలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.రాజోలు సీఐకి బుధవారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు శివకోడు ముసలమ్మ తల్లిగుడి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పాలకొల్లు నుంచి రాజోలు వస్తున్న అశోక్‌ లేలాండ్‌ వ్యాన్‌ ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడన్నారు.

వెంటనే సిబ్బంది అప్రమత్తమై వ్యాన్‌ను చుట్టుముట్టి ఆపి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన సమాచారం బయటపడిందన్నారు.

రాజోలు ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఏవీ సూర్యనారాయణరాజు ఇంట్లో దోపిడీ కేసుతో పాటు రాజోలు సర్కిల్‌లో మరో ఆరు దొంగతనాలు, అమలాపురం టౌన్‌లో గత నెల 7వ తేదీన జరిగిన సంచలనమైన దొంగతనంతో పాటు అమలాపురం రూరల్‌ సర్కిల్‌ పరిధిలో ఏడు దొంగతనాలు, రావులపాలెం సర్కిల్‌ పరిధిలో మూడు, పెద్దాపురం సర్కిల్‌ పరిధిలో రెండు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సర్కిల్‌ పరిధిలో ఒకటి, పాలకొల్లు సర్కిల్‌ పరిధిలో ఒకటి, విశాఖ జిల్లా రూరల్‌ పరిధిలో దొంగతనాలకు, దోపిడీలకు ఈ ముగ్గురు సభ్యుల ముఠా పాల్పడిందన్నారు.

ఈ ముఠాలో పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాలెంకు చెందిన తోటకూర రామకృష్ణంరాజు అలియాస్‌ రాజేష్, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామానికి చెందిన నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అలియాస్‌ మహేష్‌ ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌ విశాఖ జిల్లా నర్సిపట్నంలో ఉంటున్నాడు. 

అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటరాజు అలియాస్‌ నాని ఇతను ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఉంటున్నట్లు ఎస్పీ విశాల్‌ గున్ని వివరించారు. అంతేగాక వీరు దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేస్తున్న నరసాపురానికి చెందిన విజయ పవార్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

అమలాపురం డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో రాజోలు సీఐ కిష్టోఫర్, సిబ్బంది బొక్కా శ్రీను, పి.వెంకటేశ్వర్లు, జయరాం, వీరేంద్ర, సుబ్బారావు, రామచంద్రరావు ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ విశాల్‌ గున్ని వివరించారు. మూడేళ్లుగా భారీ దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను చాకచక్యంతో పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ విశాల్‌ గున్ని అభినందించారు.

ఈ దోపిడీ ముఠాను పట్టుకోవడంలో సహకరించిన అమలాపురం సబ్‌ డివిజన్‌ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, దేవకుమార్, పెద్దిరాజు, రమణారావును ఎస్పీ విశాల్‌ గున్ని అభినందించారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు