చిక్కారు..

15 Mar, 2018 11:46 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో దొంగతనాల వివరాలను వివరిస్తున్న క్రైమ్‌ డీఎస్పీ పల్లపురాజు, తదితరులు

హత్యలు, దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరి అరెస్టు

రూ.10 లక్షల బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం

కాకినాడ రూరల్‌: హత్యలు, దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను కాకినాడ క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ క్రైం డీఎస్పీ ఎ పల్లపురాజు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చోరీ చేసిన 330 గ్రాముల బంగారం వస్తువులు, 1150 గ్రాముల వెండి వస్తువులు, రూ.15వేలు నగదు సొత్తును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మోటిపల్లివారి వీధి, తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, ఏలూరు చాట్రపర్రు వాటర్‌ట్యాంక్‌ రోడ్డు, సరస్వతి స్కూల్‌ పక్కవీధికి చెందిన గోన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు వివిధ నేరాలతో సంబంధం ఉందన్నారు.

వీరు కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జ్యోతుల మార్కెట్‌ ఎదురుగా ఉన్న సంగీత లాడ్జీలో 107 నంబర్‌గల రూమ్‌లో ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీసీఎస్‌ ఎస్సై ఎం.పాపరాజు, సుధాకర్‌ల ఆధ్వర్యంలో క్రైమ్‌పార్టీ సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేసి అరెస్టు చేసినట్టు పల్లపురాజు వివరించారు. గొల్లపల్లి మల్లేశ్వరరావు పాత నేరస్తుడని, ఇతడికి ఏలూరు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉందన్నారు. వైజాగ్‌లో మూడు మర్డర్‌ ఫర్‌ గెయిన్స్‌ కేసులు, ఏలూరు, భీమడోలు, ఉండ్రాజవరంల్లో సుమారు 17 ఇళ్ల నేరాల కేసులు ఉన్నాయన్నారు. గొల్లపల్లి నాగమలేశ్వరరావు, గొన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు రాత్రిసమయాల్లో ఇళ్ల తాళాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేస్తారన్నారు.

నాగమల్లేశ్వరరావు 2016 డిసెంబర్‌లో తణుకు సబ్‌జైల్‌ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి, 2016–18 మధ్య కాలంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కాకినాడ, ఏలూరు టౌన్, రూరల్, కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు ఏరియాలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు బద్దలు గొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగిలించారని డీఎస్పీ ఎ పల్లపురాజు వివరించారు. కాకినాడలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 96 గ్రాముల బంగారు వస్తువు దొంగిలించారన్నారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఎల్‌సీడీ టీవీ, 80 సర్జికల్‌ బ్లేడ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ దాడుల్లో పాల్గొని ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు పాపరాజు, సుధాకర్, హెచ్‌సీ గోవిందు, పీసీలు చిన్న, శ్రీరాం, వర్మ, అజయ్, బాబులను డీఎస్పీ పల్లపురాజు అభినందించారు.

మరిన్ని వార్తలు