ఎస్‌ఐ పైకే కారు ఎక్కించబోయారు   

24 Sep, 2019 04:12 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

దూలపల్లిలో హల్‌చల్‌ చేసిన ఘరానా దొంగలు

కారు కొట్టేసి నగల దుకాణంలో చోరీకి యత్నం

అడ్డుకోబోయిన ఎస్‌ఐ పైకి కారు ఎక్కించే ప్రయత్నం

దూలపల్లి ఫారెస్ట్‌ ప్రాంతంలో చెట్టును ఢీకొట్టి ఆగిన కారు, దొంగలు పరారీ 

కుత్బుల్లాపూర్‌: ముగ్గురు దొంగలు.. కారు కొట్టే శారు.. నగలషాప్‌లో దొంగతనానికి ప్లాన్‌ చేశారు.. ఇంతలో ఎస్‌ఐ అక్కడికి రావడంతో ఆయనపైకే కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. తర్వాత కారుతో పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దూలపల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. దూలపల్లి నుంచి దుండిగల్‌ మార్గంలో దుండిగల్‌ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే పేట్‌ బషీరాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌ స్పెక్టర్‌ సంతోష్‌కు సమాచారమిచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి చేరుకున్న డీఐ సంతోష్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి కలిసి ఆ కారు (మారుతీ సుజుకీ ఏకో టీఎస్‌10ఈజీ 7029) దగ్గరకు వెళ్లారు.

ఇంతలో అందులోని వ్యక్తులు ఒక్కసారిగా కారు స్టార్ట్‌ చేసి ఎస్‌ఐ మీదకు పోనివ్వడంతో అతను కిందపడిపోయారు. పోలీసులు కింద పడిపోయిన ఎస్‌ఐను లేవదీసి కారును వెంబడించారు. వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి దూలపల్లి ఫారెస్ట్‌ రోడ్డు సమీపంలో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అందులోని ముగ్గురు కారు వదిలేసి ఫారెస్ట్‌ ప్రాంతంలోకి పరారయ్యారు. దీంతో జీడిమెట్ల, పేట్‌ బషీరాబాద్, దుండిగల్‌ పోలీసులను అప్రమత్తం చేశారు.కారులో మారణాయుధాలు.. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పరిశీలించగా గ్యాస్‌ కట్టర్, గడ్డపార, షటర్‌లు లేపే సామగ్రితో పాటు మారణాయుధాలు లభించాయి. కారు నిలిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సమీపంలో ఉన్న ధనేష్‌ జ్యువెలరీ దుకాణంలో దొంగతానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ మహేశ్‌ కేసు నమోదు చేశారు. 

చోరీకి యత్నం.. 
దొంగలు ఉపయోగించిన వాహనాన్ని అదే రోజు రాత్రి అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అదే పోలీస్‌స్టేష¯Œ  పరిధిలో ఏటీఎం, జ్యువెలరీ దుకాణాల్లో చోరీ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దొంగలించిన వాహనం సికింద్రా బాద్‌ తిరుమలగిరిలోని సుభాష్‌నగర్‌కు చెందిన పొన్నాల వెంకటేశ్‌ పేరుపై రిజిస్టర్‌ అయి ఉంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు