దొంగలు బాబోయ్‌.. దొంగలు

4 Aug, 2018 09:57 IST|Sakshi

ఒంగోలు(ప్రకాశం): నెల రోజులుగా వరుస దొంగతనాలతో ఒక వైపు నగర ప్రజానీకం, మరో వైపు పోలీసులు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు యథావిధిగా గస్తీ తిరుగుతున్నా దొంగతనాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏ చిన్న ఘటన జరిగినా పోలీసులు వెంటనే స్పందించి క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దించినా నేరస్తుల జాడ తెలియడం లేదు. ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరా చేసేకుని బురిడీ వేసే వారు కొందరైతే.. అర్దరాత్రి తాళాలు పగలగొట్టి మరీ ఇళ్లల్లోకి ప్రవేశించే వారు మరికొందరు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు గస్తీ చేస్తున్నా దొంగల ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలం చెందుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గత నెలలో జరిగిన దొంగతనాలు

  • సింగరాయకొండకు చెందిన గౌరవరపు భవానీకుమారి అనే మహిళ స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు ఓ యువకుడి సాయం తీసుకుంది. అతడు డబ్బులు డ్రా చేసి ఇచ్చిన అనంతరం ఆమె ఏటీఎం కార్డు బదులుగా మరో ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఆమె అది గుర్తించక ఇంటికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఆమె సెల్‌ఫోన్‌కు రూ.30 వేల నగదు డ్రాచేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. తన ఏటీఎం కార్డును పరిశీలించుకోగా అది నకిలీదని తేలిపోయింది.
  • రామ్‌నగర్‌లో ఇంటిముందు పార్కు చేసి ఉంచిన మారుతీ స్విఫ్ట్‌ కారును దొంగలు అపహరించుకెళ్లారు.
  • పెన్షన్‌ మంజూరైందంటూ స్థానిక గోపాలనగరంలో ఒక వృద్ధ మహిళలను మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌తో దొంగ ఉడాయించాడు. మీకు పెన్షన్‌ పెరిగిందని, ఆ మొత్తం రావాలంటే ఫొటో తీసుకునేందుకు వచ్చామని నమ్మబలికాడు.
  • ఆగంతకుడి మోసాన్ని గమనించలేని వృద్ధురాలు మెడలోని బంగారు చైన్‌ను నిద్రపోతున్న భర్త తలగడ కింద ఉంచి ఫొటో తీయించుకుంది. ఈ క్రమంలో ఆధార్‌కార్డు నకలు కావాలంటూ జిరాక్స్‌ తీసుకురమ్మని ఒత్తిడి చేసి ఆమె బజారుకు వెళ్లి వచ్చేలోపు బంగారు చైన్‌తో అదృశ్యమయ్యాడు.
  • ఒక మహిళ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా రోజూ ఉదయాన్నే టీ కొట్టు నిర్వహిస్తుంటోంది. టీ వద్ద రద్దీ ఉన్నంత సేపు టీతాగి అక్కడే తచ్చాడిన ఇద్దరు యువకులు ఆమె ఒంటరిగా ఉండగా డబ్బులు ఇస్తున్నట్లు నటిస్తూ ఆమె మెడలోని బంగారు చైన్‌తో అదృశ్యమయ్యారు. 
  • స్థానిక సంతపేట ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలోని రెండు బజార్లలో మూడు గృహాల్లో తలుపులు పగలగొట్టి దొంగలు హల్‌చల్‌ చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనల్లో ఇళ్లల్లో డబ్బులు లేకపోవడంతో నష్టం చోటుచేసుకోలేదు
  • స్థానిక సీతారామపురంలో ఇంటి ఆవరణలో పార్కు చేసిన రెండు మోటారు బైకుల చక్రాలను ఊడదీసుకొని మరీ దొంగలు అదృశ్యమయ్యారు.
  • ఇటీవల స్థానిక దేవుడుచెరువులోని శర్మా కాలేజీ బ్రాంచి ఆవరణలోని ఏటీఎంలో నూతలపాటి చంద్రశేఖర్‌ అనే వ్యక్తి తన ఏటీఎం కార్డును మర్చిపోయి వెళ్లాడు. దానిపై పిన్‌ నంబర్‌ ఉండటంతో దాని సాయంతో ఓ వ్యక్తి రూ.30 వేలు డ్రాచేసుకున్నాడు. సెల్‌కు మెసేజ్‌ వచ్చినప్పుడు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. 
  • స్థానిక యూనియన్‌ బ్యాంకు కార్యాలయం వద్ద కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన సాంబశివరావు, వాణి అనే దంపతులు డబ్బులు డ్రా చేసుకొని ఆటోలో ఎక్కారు. తీరా బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్దకు వెళ్లే సరికి బ్యాగుకోసి అందులో రూ.2.10 లక్షలు అపహరణకు గురయ్యాయి. దీంతో ఈ కేసు ఒన్‌టౌన్‌ , టూటౌన్‌ పోలీసులు తమది కాదంటే తమది కాదనుకుంటూ చివరకు ఎస్పీ జోక్యంతో కేసు కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇవి కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక నిత్యం నూతన నిర్మాణాల వద్ద మోటార్లు, వైర్లు వంటివి అపహరణకు గురికావడం సాధారణంగా మారిపోయింది.

నిఘా వైఫల్యం

ప్రస్తుతం నగరంలో నిఘా నిస్తేజంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బస్టాండ్‌లో రాత్రి 11 గంటల దాటితే మందుబాబుల హడావుడి మొదలవుతుంది. రోజుకో పోలీసు అధికారి నగరంలో డ్యూటీ చేస్తున్నా బస్టాండ్‌ సెంటర్‌గేట్‌లో మాత్రం మూడు షాపులు మాత్రం తెరిచి ఉంటాయి. మిగిలిన వారు మాత్రం మూతవేయకపోతే వారికి ఇచ్చే కౌన్సిలింగ్‌ సాధారణంగా ఉండటం లేదు. వీటిలో ఒకటి హోటల్, టీ స్టాల్, ఫ్రూట్‌ స్టాల్‌. నగరంలో ఉండే యువత అయితే రాత్రి 12 గంటల సమయంలో గుంపులుగా వచ్చి  అక్కడ కాలక్షేపం చేసి వెళ్తుంటారు. రక్షక్‌లో సైతం సిబ్బంది తగ్గిపోవడంతో వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక బీట్‌ కానిస్టేబుళ్లు అయితే ఎవరిని అనుమానిస్తే ఏమవుతుందో అనుకుంటూ కొంత సందిగ్థ స్థితిలో ఉండిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. బ్లూకోల్ట్స్‌ పరిస్థితి మరింత దారుణం.

ఒక్కో స్టేషన్‌ పరిధిలో ఉదయం పూట సింగిల్‌గా రెండు వాహనాలు తిరుగుతుండగా రాత్రిపూట స్టేషన్‌ పరిధిలో మొత్తం ఒకే వాహనం తిరుగుతోంది. గతంలో రాత్రిపూట సీసీఎస్‌ సిబ్బంది, ఐడీ పార్టీ సిబ్బంది, ఎస్పీ క్యాట్‌ పార్టీ సిబ్బంది నగరంలో ఏం జరుగుతుందనే దానిపై ఎవరికి వారు నిఘా పెట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించేవారు. ప్రస్తుతం ఆ పార్టీలు కూడా దాదాపు స్తబ్దుగా ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కర్నూల్‌ రోడ్డు షాపు ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఒంగోలు డీఎస్పీని కలిసి నగరంలో దొంగతనాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు