పట్టపగలే దొంగల హల్‌చల్‌

8 May, 2018 12:55 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న డీఎస్పీ, బాధిత కుటుంబ సభ్యులు

ఉపాధ్యాయుడికి పిస్టల్‌ బెదిరింపు

కుటుంబ సభ్యుల కేకలకు    చాకు దూసి పరారీ

గాయపడిన ఉపాధ్యాయుడు

జడ్చర్లలో చర్చనీయాంశం

జడ్చర్ల మహబూబ్‌ నగర్‌ : గుర్తుతెలియని దుండగులు పట్టపగలే హల్‌చల్‌ సృష్టించారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడి.. అతని కణతపై పిస్టల్‌ గురిపెట్టి.. మరొకరు చాకు దూశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన బాదేపల్లి పట్టణంలోని రంగారావుతోటలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుడు రాజేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం..

ఉపాధ్యాయుడు రాజేశ్వర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటిలోకి తాగునీటిని తీసుకువచ్చిన అనంతరం దుస్తులు ఇస్త్రీ చేయించేందుకు బ్యాగు తీసుకొని బయటకు వస్తుండగా అకస్మాత్తుగా గేటును తోసుకుని ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి బయటకు వస్తూ ఎవరు మీరని ప్రశ్నించారు. వారు ఏదో గుర్తించని భాషలో మాట్లాడుతూ పైపైకి వచ్చారు. వచ్చీ రాగానే గొంతును నొక్కిపట్టి ఓ వ్యక్తి ప్యాంటు జేబులో నుంచి తుపాకీ తీసి కణతకి గురిపెట్టాడు. మరో చేతిలో ఉన్న చాకును కడుపునకు ఆనించాడు.

వెనువెంటనే ఉన్న మరో ఇద్దరు దుండగులు ఇంటి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితిని పసిగట్టిన రాజేశ్వర్‌రెడ్డి భార్య లక్ష్మి, పిల్లలు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. దీంతో చుట్టుపక్కల వారు అరుపులు విని బయటకు వచ్చి చూసేలోగానే దుండగులు రాజేశ్వర్‌రెడ్డిని గొంతును వదిలి బయటకు పరుగులు తీసి పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో ఉన్న పదునైన కత్తిని గేటు దగ్గరే పారేసి వెళ్లారు.

రాజేశ్వర్‌రెడ్డి గొంతును దుండుగులు గట్టిగా అదిమి పట్టిన సందర్భంగా ఛాతి భాగంలో గోరు గుచ్చుకుని చిన్నపాటి గాయమైంది. దీంతో ఒక్కసారిగా బాధిత కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసేలోగా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి అర్థమయ్యేలోగా దుండుగులు పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

30-35 ఏళ్ల వయస్సు వారే.. 

దుండగులు ఇంట్లోకి చొరబడి పిస్టల్‌తో ఇంటి యజమానిని బెదిరించిన ఘటన పట్టణంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. ఇప్పటి వరకు కేవలం దొంగతనాలు మాత్రమే జరిగాయి. కానీ ఏకంగా పిస్టల్, కత్తి చూపి దాడికి పాల్పడిన ఘటన ఇదే మొదటిది. దుండగులు హిందీ తరహా భాష మాట్లాడారంటే వారు ఇతర రాష్ట్రానికి చెందినవారై ఉండవచ్చని భావిస్తున్నారు. ఎరుపు, బ్లూ రంగుల షర్టులు ధరించి ఉన్నారని, మరొకరు తలకు కర్చీఫ్‌ కట్టుకున్నాడని బాధితులు పోలీసులకు వివరించారు.

అంతా 30-35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటారన్నారు. అయితే దుండగులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి తలుపులు మూసి కుటుంబ సభ్యులను తుపాకీ, కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లేలా ప్రణాళిక వేసి ఉంటారని అయితే ఊహించని విధంగా దుండగులు ఇంటి గేటు తెరుచుకుని ఇంట్లోకి వచ్చే తరుణంలోనే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు వారికి ఎదురుగా రావడంతో విఫలమై ఉంటుందని పేర్కొంటున్నారు. వారు ఏమాత్రం ఇంట్లోకి వచ్చినా పరిస్థితి మరోలా ఉండేదని భావిస్తున్నారు.  

ముమ్మర దర్యాప్తు.. 

సంఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ భాస్కర్, సీఐ బాలరాజుయాదవ్‌ తదితరులు సందర్శించి వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి విచారించారు. సీసీ పుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని గుర్తించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, లాడ్జీలలో తనిఖీలు చేపట్టారు. కేసును ఛేదించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు.  
 

మరిన్ని వార్తలు