తుపాకీ గురిపెట్టి.. ఖరీదైన గంధం చెట్ల నరికివేత

16 Nov, 2019 21:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : జిల్లా జడ్జి నివాస ప్రాంగణంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది కణతకు తుపాకీ గురిపెట్టి విలువైన నాలుగు గంధం చెట్లను నరుక్కెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన గురించి ఎస్పీ శివేంద్ర సింగ్‌ శనివారం వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఐదుగురి దొంగల ముఠాలో.. మొదటగా ఒక దొంగ గురువారం అర్ధరాత్రి న్యాయమూర్తి నివాస ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీస్‌ గార్డు బుధిలాల్‌ కోల్‌ కణతకు తుపాకీ పెట్టి బెదిరించి.. విషయం బయటకు రాకుండా చూసుకున్నాడు. దీంతో మిగతా నలుగురు దొంగలు లోపలికి ప్రవేశించి నాలుగు గంధం చెట్లను నరికి తీసుకెళ్లిపోయారు. చెట్ల విలువ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది.

ఈ క్రమంలో దొంగలు ఎవరికీ హాని తలపెట్టలేదు. దొంగతనం జరుగుతున్న సమయంలో జడ్జి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారని ఎస్పీ తెలిపారు. మరుసటి రోజు పోలీస్‌ గార్డు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, దొంగలు ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కనౌజ్‌ ప్రాంతంలోని వ్యక్తులను రెవా పోలీసులు ఇలాంటి కేసుల్లో అరెస్ట్‌ చేశారు. ‘గంధం చెక్కను సువాసన ఇచ్చే పర్‌ఫ్యూమ్‌లలో, అగర్‌బత్తీలలో ఉపయోగిస్తారు. ఇలాంటి పరిశ్రమలు కనౌజ్‌ ప్రాంతంలో ఉన్నాయని, నిందితుల కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ తెలిపారు. 

మరిన్ని వార్తలు