సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు 

14 Aug, 2019 11:24 IST|Sakshi

సాక్షి, పిట్లం(కామారెడ్డి) : మండల కేంద్రంలోని శాంతినగర్, రాజీవ్‌గాంధీ, బీజే కాలనీల్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయం 4 గంటలకే ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించారు. దీంతోపాటు కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. మూడు కాలనీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 150 మోటారు సైకిళ్ళు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను ఎస్‌పీ శ్వేత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ శ్వేత మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి దుకాణదారుడు, ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.

తద్వారా చోరీలు జరిగే ఆస్కారం ఉండదన్నారు. ఇటీవలి కాలంలో చోరీలు పెరిగాయని, వాటిలో అధికంగా సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో చోరీలు జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. కొద్ది రోజుల కింద పిట్లం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. పోలీసులు ఎంత పటిష్టంగా కాపలా ఉన్నా చోరీలు జరుగుతుంటాయని, వీటిని నివారించాలంటే సీసీ కెమెరాలు మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఇక వాహనదారులు వాహనం నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

దీంతో పాటుగానే ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. తరువాత స్వాధీనం చేసుకున్న మోటార్‌ సైకిళ్ల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా పత్రాలు ఉన్నవాటిని యజమానులకు అప్పగించారు. వాహనాలకు సరైన పత్రాలు లేనివాటికి జరిమాన విధించారు. ఈ కార్యక్రమంలో బాన్స్‌వాడ డీఎస్‌పీ యాదగిరి, బిచ్కుంద సీఐ నవీన్‌ కుమార్, ఎస్‌ఐలు సుధాకర్, నవీన్‌ కుమార్, సాయన్న, అభిలాష్, అశోక్, సందీప్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయం 
ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ శ్వేత తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఉదయం ఎస్పీ శ్వేత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డ్‌లను పరిశీలించి స్టేషన్‌ పరిసరాలను చూసి ఎస్‌ఐ నవీన్‌ కుమార్‌తోపాటు సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మిగితా పోలీస్‌ స్టేషన్లు పెద్దకొడప్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పోలీస్‌ సిబ్బంది సమస్యలను, సీసీ కెమెరాలు పని తీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ నవీన్‌ కుమార్, ఎస్‌ఐ నవీన్‌ కుమార్, ఏఎస్‌ఐ మల్లారెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు