దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త!

25 Feb, 2019 12:18 IST|Sakshi
బాధితురాలు

బరంపురం: నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న గంజాం జిల్లాలో మళ్లీ నేరగాళ్ల ఆగడాలు సాగుతున్నాయి. ఇటీవల బరంపురం. గంజాం జిల్లా పోలీసులు గంజాం అపరాధిముక్తి అభిజాన్‌ పేరుతో పలువురు నేరస్తులను అరెస్టు చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే. నగరంలోని ఓ ఆలయానికి వెళ్లి, తిరిగి వస్తున్న ఓ వృద్ధురాలి నుంచి 7 తులాల బంగారు అభరణాలను ఆదివారం కొంతమంది దోపిడీ దొంగలు చోరీ చేసి, పరారయ్యారు. ఇదే సంఘటన ప్రస్తుతం జిల్లాలో సంచలనం రేకిత్తిస్తోంది. ఐఐసీ అధికారి సమచారం ప్రకారం.. పార్వతి బెహరా అనే వృద్ధురాలు పెద్దబజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖస్పా వీధిలో ఉన్న జగన్నాథుని ఆలయానికి ఉదయం వెళ్లింది.

దేవునికి పూజలు చేసిన అనంతరం ఆలయం నుంచి తిరిగి, వస్తున్న వృద్ధురాలిని పోలీసుల వేషధారణలో ఉన్న కొంతమంది దుండగులు గమనించి, వెంబడించారు. కొంత దూరం వెళ్లాక, వృద్ధురాలి వద్దకు వెళ్లి, తాము పోలీసులమని, నగరంలో దొంగలు తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసి, వేరేచోట దాచుకోవాలని మాయమాటలు చెప్పారు. అనంతరం వృద్ధురాలు తీసిన ఆభరణాలను దుండగులు ఒక పేపర్‌పొట్లాంలో పెట్టి, వృద్ధురాలికి అందజేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న వృద్ధురాలు పేపరు పొట్లాం విప్పి, చూడగా, ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో అవాక్కయిన బాధితురాలు మొర్రోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు