రెచ్చిపోతున్న ‘సంక్రాంతి’ దొంగలు

8 Jan, 2019 20:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగర జనం తమ సొంత గ్రామాల దారి పట్టారు. ఇప్పటికే రైల్వేస్టేషన్‌లు, బస్‌ స్టేషన్‌లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో భాగ్యనగరం సగం ఖాళీ అయిపోయింది. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. పట్టపగలే దోపిడీలతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. 

ఎల్బీ నగర్ జోన్‌లో నిన్నటిదాకా చైన్ స్నాచర్లు జనాన్ని హడలెత్తించారు. ఇపుడు పట్టపగలు సంక్రాంతి సీజన్ దొంగలు భయపెడుతున్నారు. వనస్థలిపురంలో మంగళవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు ఇండ్లలో చోరీ చేశారు. 30 తులాల బంగారం, 4 లక్షల నగదును అపహరించారు. హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌లోని మరో ఇంట్లో కూడా దొంగలు ఆరు తులాల బంగారం చోరీ చేశారు. సం‍ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లే నగర ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. 

సంక్రాంతి పండుగకు దొంగతనాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.  గల్లీ గస్తీ, పెట్రోలింగ్ మొబైల్స్, సీసీఎస్ సిబ్బంది మానిటరింగ్, ప్రతిస్టేషన్‌లోని డిటెక్టివ్ విభాగం గస్తీ, ఎస్‌ఓటీ నిఘా.. ఇలా అన్ని విభాగాల వారు రాత్రి, పగటిపూట, ఉదయం సమయాల్లో ముమ్మరంగా తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులను గుర్తిస్తున్నారు. 

మరిన్ని వార్తలు