మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

7 Aug, 2019 07:20 IST|Sakshi
  మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ మోకా సత్తిబాబు, డీఎస్పీ రమేష్‌రెడ్డి,  నైట్‌ వాచ్‌మెన్‌ నాగబాబును ప్రశ్నిస్తున్న ఏఎస్పీ సత్తిబాబు   

పాశవికంగా గొంతుకోసి హతమార్చిన వైనం 

హాస్టల్‌లో వదిలివెళ్లిన 24 గంటలలోపే ఘాతుకం

కన్నీరు మున్నీరుగా విలపించిన బాలుడి తల్లి

తోటి విద్యార్థులే హత్య చేశారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు 

చిన్నారిని చిదిమేశారు.. కర్కశంగా గొంతుకోసి చంపేశారు.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లికి గుండెకోతను మిగిల్చారు.. చల్లపల్లి బీసీ వసతి గృహంలో ఓ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన దివిసీమలో సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి గొంతు కోసి బాత్‌ రూమ్‌లో పడేశారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి తల్లి తల్లడిల్లిపోయారు. అయితే బాలుడి తండ్రి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తల్లి ఆరోపిస్తుండగా.. హాస్టల్‌లోని తోటి విద్యార్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు 
దర్యాప్తు చేస్తున్నారు.

సాక్షి, అవనిగడ్డ : బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.  పోలీసులు అందించిన వివరాలు.. బాలుడు దాసరి ఆదిత్య(8) మూడో తరగతి చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఉదయానే డాబా పైకి వెళ్లిన తోటి విద్యార్థులు ఆదిత్య విగతజీవిగా పడి ఉండడంతో భయాందోళన చెంది, వెంటనే కాపలాదారుడు నాగబాబుకు చెప్పటంతో అధికారులకు సమాచారం అందించారు. పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్‌లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర, ఆదిలక్ష్మి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు అశోక్, రెండో కుమారుడు ఆదిత్య(8) స్థానిక బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. రవీంద్ర శుభకార్యాలకు మండపాలు డెకరేషన్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

హాస్టల్‌లోకి వెళ్లింది సోమవారమే..
ఆదివారం ఇంటికి వచ్చిన ఆదిత్యకు తల్లి కొత్తబట్టలు కొనిచ్చి సోమవారం ఉదయం హాస్టల్‌కు తీసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి  పైఅంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో హత్యకు గురయ్యాడు. నిద్రలేపి చంపేశారా? ఆదిత్య హత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఆదిత్య అన్నయ్య అశోక్‌ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రలేపి మూత్ర విసర్జనకు వెళ్లమని చెప్పాడు. నిద్రలో ఉన్న అశోక్‌  రావడం లేదని చెప్పి ప్రార్థన చేసి నిద్రపోయాడు. అనంతరం అదే వ్యక్తి ఆదిత్యను నిద్రలేపి వసతిగృహంపై అంతస్తులో ఉన్న బాత్‌రూంల వద్దకు తీసుకెళ్లి మెడకోసి హత్య చేసి ఉంటాడని 
అనుమానిస్తున్నారు.

మెట్ల కింద రక్తపు మరకలు..
బీసీ వసతి గృహంలోని పై అంతస్తు బాత్‌రూంలో దాసరి ఆదిత్య హత్యకు గురి కాగా గ్రౌండ్‌ఫ్లోర్‌ మెట్లు కింద రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. వసతిగృహంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి  పై అంతస్తులోని మరుగుదొడ్లుకు ఆదిత్య ఎందుకు వెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది.

తండ్రి సంబంధాలపై అనుమానాలు..
మృతుడి తండ్రి రవీంద్రకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త  ఈ హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై గతంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దలు రాజీ కుదర్చడం జరిగింది.  

ఏఎస్పీ సత్తిబాబు విచారణ
తొలుత డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ ఎం.వెంకటనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు çహత్య తీరును పరిశీలించారు.   వసతిగృహంలో ఉన్న విద్యార్థులు, వాచ్‌మెన్, ఇన్‌చార్జి వార్డెన్‌ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. డాగ్‌స్క్యాడ్, క్లూస్‌టీంలు రంగంలో దిగి ఆధారాలు సేకరించాయి. బీసీ సంక్షేమశాఖ డీడీ  ఐ.రమాభార్గవి బీసీ వసతిగృహానికి వివరాలు తెలుసుకున్నారు.

ఆర్డీ ఓ పరిశీలన..
బాలుడి దారుణ హత్య విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, తహసీల్దార్‌ కె.స్వర్ణమేరి హాస్టల్‌ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. సిబ్బందిని ఆరా తీశారు. శవ పంచనామా అనంతరం పోలీసులు బాలుడి తండ్రి రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించారు.

నిందుతుడిని అరెస్ట్‌ చేయాలని ఆందోళన
బాలుడిని కిరాతంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయనివ్వమని మృతుడి బంధువులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, వాచ్‌మన్‌ని సస్పెండ్‌ చేయాలని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులతో ఏఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా!
దాసరి ఆదిత్య హత్య కేసులో పోలీసుల విచారణ భిన్న కోణాల్లో సాగుతోంది. హాస్టల్‌లో ఉంటున్న ఒక విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన ఆయుధంతో మెడకోసి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలడంతో ధర్మాకోల్‌ కట్టర్‌(చిన్న పోల్టు చాకు)తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  గుంటూరు జిల్లాకు చెందిన ఓ  పదోతరగతి విద్యార్థ్ధి కొన్నిరోజులు కలసి  పడుకున్నారు. ఆ విద్యార్థి వికృత చేష్టలకు భయపడి అతని దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ విద్యార్ధి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు  తెలుస్తోంది.  

వార్డెన్, వాచ్‌మన్‌ సస్పెన్షన్‌జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌
అవనిగడ్డ: చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసలి ఆదిత్య(8) హత్యకు గురైన నేపథ్యంలో ఇన్‌చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్‌ నాగబాబుని సస్పెండ్‌ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతుందని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు