గాంధీ అరెస్ట్‌

10 Aug, 2018 10:50 IST|Sakshi
పోలీసు స్టేషన్‌లో తిరుమురుగన్‌ గాంధీ

విమానాశ్రయంలోఅదుపులోకి

బెంగళూరుకు చెన్నై పోలీసులు

సర్వత్రా ఖండన

మే–17 ఇయక్కం కన్వీనర్‌ తిరుమురుగన్‌ గాంధీ అరెస్టు అయ్యారు. విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు చెన్నై పోలీసులు బెంగళూరు బయలు దేరి వెళ్లారు.

సాక్షి, చెన్నై : తమిళాభిమాన సంఘంగా మే–17 ఇయక్కం కార్యకలాపాలు రాష్ట్రంలో సాగుతున్నాయి. దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న తిరుమురుగన్‌ గాంధీని ఇటీవల  పోలీసులు టార్గెట్‌ చేశారు. గత ఏడాది ఆయన్ను గూండా చట్టం కింద సైతం అరెస్టుచేసి కొంతకాలం కటకటాల్లో పెట్టారు. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఆ కేసు నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మీద పోలీసులు పలు రకాల కేసుల్ని నమోదు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తూత్తుకుడి అల్లర్ల కేసులో తిరుమురుగన్‌ పేరును చేర్చారు. అలాగే, గ్రీన్‌ హైవేకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ పలు కేసుల్ని నమోదు చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా లుక్‌ అవుట్‌ నోటీసు సైతం జారీచేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ సమావేశం నిమిత్తం ఇక్కడి నుంచి జెనీవాకు వెళ్లారు. అక్కడ తూత్తుకుడి స్టెరిలైట్‌ పరిశ్రమ గురించి , గ్రీన్‌ హైవే ప్రాజెక్ట్‌ గురించి, తమిళనాట ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లోనూ వివాదాల్ని పసిగట్టిన పోలీసులు తిరుమురుగన్‌ గాం«ధీని టార్గెట్‌ చేశారు.

బెంగళూరులో అరెస్టు
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ సమావేశాన్ని ముగించుకుని బుధవారం బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే, లుక్‌ అవుట్‌ నోటీసును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తిరుమురుగన్‌ గాంధీని అరెస్టు చేయడానికి తగ్గట్టు విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బెంగళూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీదున్న కేసుల్ని పరిగణించి అరెస్టుచేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. తిరుమురుగన్‌ గాంధీని తమ కస్టడికి తీసుకుని చెన్నైకి అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం తిరుగు పయనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, తిరుమురుగన్‌ గాంధీని బెంగళూరులో అరెస్టు చేయడాన్ని తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంనేత దినకరన్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఈ అరెస్టును ఖండించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు