చావు బతుకుల్లో కోడలు

5 Feb, 2020 12:58 IST|Sakshi

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

భువనేశ్వర్‌: మంచానికి కట్టి..నిప్పు పెట్టి..వేధించడంతో ఓ ఇంటి కోడలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విచారకర సంఘటన వెలుగు చూసింది. కేంద్రాపడా జిల్లా రాజ నగర్‌ పోలీసు స్టేషన్‌ బొరొడియా గ్రామంలో ఈ సంఘటన సంభవించింది. వరకట్న వేధింపులే దీనికి కారణంగా భావిస్తున్నారు.

23 ఏళ్ల రస్మిత సాహును అత్తింటి వారు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు ఆరోపణ. మంటల్లో ఆమె శరీరం దాదాపు 60 శాతం కాలింది. ఈ నెల 1వ తేదీన సంభవించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. 2018 వ సంవత్సరం జూన్‌ నెలలో విక్రమ దాస్‌తో రస్మిత సాహుకు వివాహం జరిగింది. వివాహం సందర్భంగా రస్మిత తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు సమర్పించారు. కోడలు తెచ్చిన కట్న కానుకలతో సంతృప్తి చెందని అత్తింటి వారు కోడలిని తరచూవేధించేవారు.

అత్తింటి వారి వేధింపులతో రస్మితకు మానసిక, శారీరక శాంతి లేకుండా పోయిందని భావించిన పుట్టింటి వారు గత ఏడాది స్థానిక రాజ్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వేధింపులు పునరావృతం కావని అత్తింటి వారు పోలీసుల ఎదుట నమ్మబలికి కోడలిని ఇంటికి తీసుకువెళ్లి మరోసారి కోడలిపై వేధింపులకు పాల్పడడంతో ఈ విచారకర సంఘటన జరిగినట్లు రస్మిత తల్లిదండ్రులు వివరించారు. తన కుమార్తె రస్మిత సాహును అత్త, మామ, వివాహిత ఆడ పడుచు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు బాధిత  యువతి తండ్రి బ్రహ్మానంద సాహు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఐపీసీ 498 – ఎ, 323, 307, 34, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అనుమానిత నిందితులుగా అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు