ప్రాణం తీసిన సరదా

27 Jan, 2020 12:56 IST|Sakshi
విలపిస్తున్న గౌస్‌పీర్‌ తల్లి, బంధువు

ఈతకు వెళ్లి  ముగ్గురుచిన్నారుల మృతి

వీరిలో ఇద్దరు అన్నదమ్ములు

రోదనలతో మిన్నంటినఆసుపత్రి

కడప అర్బన్‌ : తమ తల్లుల ఆశలను నెరవేర్చాల్సిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లి  విలువైన ప్రాణాలను కోల్పొయారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారిని  కోల్పోయి కష్టాల బారిన కాలం వెళ్లదీస్తున్న వారిని ఈ సంఘటన మరింత కుంగదీసింది. ఆదివారం సెలవురోజు కావడంతో ముగ్గురు చిన్నారులు సమీపంలోని బుడ్డాయపల్లె చెరువులోని బుదరగుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువులో బురద ఉందనే విషయాన్ని  గ్రహించలేకపోయారు. బురదలోకూరుకుపోయారు. కొన్ని క్షణాల్లోనే వారి ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయాయి. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  కడప నగర శివార్లలోని రామాంజనేయపురం సాగర్‌ కాలనీకి చెందిన షేక్‌ మహమ్మద్‌ యూసఫ్, షబానాల కుమారులు షేక్‌ ఖాజా (11) షేక్‌ మౌలా(9)లతోపాటు షేక్‌ హబీబుల్లా, సాబీరున్‌ల కుమారుడు షేక్‌ గౌస్‌పీర్‌ (9) ఆదివారం ఇంటిలో తమ తల్లులు, బంధువులతో కలిసి ఉదయం నుంచి సరదాగా గడిపారు. 

మధ్యాహ్నం  చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సాయంత్రం సమీపంలోని బుడ్డాయపల్లె చెరువు వద్దకు వీరు ముగ్గురు వెళ్లారు. అక్కడ చెరువులో నీళ్లు ఎక్కువగా లేకపోవడం, వీరు దిగిన గుంతలో పైకి నీళ్లు, లోపల బురద ఉండడం గమనించలేకపోయారు. ఈత కొడతామని ఆడుకుంటూ అందులోకి దిగారు.  కొంతసేపటికే బురదలో కూరుకుపోయారు. చీకటి పడగానే ముగ్గురు చిన్నారుల తల్లులు, వారి బంధువులు కలిసి వీరి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిమ్స్‌ సీఐ సత్యబాబు తమ సిబ్బందితో కలిసి చిన్నారుల ఆచూకీ కోసం  ప్రయత్నించారు. సాగర్‌ కాలనీకి సమీపంలో, రిమ్స్‌ పోలీసుస్టేషన్‌కు వెనుక భాగాన ఉన్న సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ పిల్లల అడుగులు గమనించి లోపల పరిశీలించాలని స్థానికులను గుంతలోకి దించారు. లోతుగా వెతకడంతో చిన్నారుల జాడ తెలిసింది. వెంటనే వారిని బయటికి తీశారు. అప్పటికే  విగత జీవులుగా మారిపోయారు. వారిని రోదనల మధ్య రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. క్యాజువాలిటీ నుంచి మృతదేహాలను రిమ్స్‌ మార్చురీకి తరలించారు.

విషాదంలో రిమ్స్‌ ఆవరణం
 ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడడంతో రామాంజనేయపురం సాగర్‌ కాలనీకి చెందిన ప్రజలు రిమ్స్‌కు చేరుకుని అయ్యో పాపం చిన్నారులంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాల్లో గౌస్‌పీర్‌ తండ్రి హబీబుల్లా ఇప్పటికే మృతి చెందాడు. మిగతా ఇద్దరు ఖాజా, మౌల తండ్రి మహమ్మద్‌ యూసఫ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే అతను కూడా ఐదు సంవత్సరాల కిందట మృతి చెందారు. పిల్లలు తనను విడిచి వెళ్లడంతో వారి తల్లి షబాన తీవ్రంగా విలపించి అస్వస్థతకు గురైంది.  అన్నదమ్ములిద్దరినీ రిమ్స్‌ క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆమెకు, వారి మరణవార్త చెప్పకుండా తిరుపతికి తీసుకెళదామని  ఓదార్చేందుకు ప్రయత్నించారు. చివరకు ఆమె పిల్లలిద్దరూ చనిపోయారని తెలుసుకుని తీవ్రంగా విలపించింది. ఈ సంఘటనపై చిన్నారుల బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు