అంతులేని విషాదం

25 Dec, 2019 12:57 IST|Sakshi
మృత్యువాత పడిన భారతి ,షేక్‌ దరియావలి

చెట్టును ఢీకొట్టిన ఆటో

ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు

తాడికొండ మండలం లాం వద్ద ఘటన

గుంటూరు, తాడికొండ: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. నాలుగు మెతుకులు సంపాదించడానికి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే సారి ముగ్గుర్ని బలిగొని ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన తాడికొండ మండలం లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్‌ సెల్‌ఫోన్‌ వెనక్కి ఇద్దామనుకొనే ప్రయత్నంలో ఒంటి చేతితో వాహనం నడపడం, అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మృతితోపాటు మరో ఐదురుగు గాయాలపాలయ్యారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరందరిదీ ఒక్కో గాథ. పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడిని వెంట బెట్టుకొని పనికి వెళదామని ఆటోలో మోతడక నర్సరీలలో పని చేసేందుకు బయలుదేరిన షేక్‌ దరియాబీ కుమారుడు దరియావలి (12) ప్రమాదంలో ఛాతి, పొట్టలో బలమైన గాయం కావడంతో అసుపత్రికి చేరుకొనేలోపుగా మరణించాడు.

మరో కుటుంబానికి చెందిన మృతురాలు రాయపూడి భారతి(28) 2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల కుమారుడు సంతోష్‌ను వెంటబెట్టుకొని వెళుతుండగా తలకు బలమైన గాయం కావడంతో అమె ఆసుపత్రికి చేరుకొనేలోగా ప్రాణాలొదిలింది. కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరో మృతురాలు మాతంగి నాగేంద్రమ్మ (52) అనే మహిళ తీవ్ర గాయాలతో జీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈమె కోడలు ఎస్తేరు రాణికీ తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతుండగా ఇంటివద్ద ఎత్తుకొనేందుకు ఎవరూ లేరని వెంట తీసుకెళ్లిన 2 సంవత్సరాల కుమారుడు చిన్నారి అరుణ్‌ తేజ్‌ కూడా ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్తేరు రాణి చెల్లలు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. మృతురాలు నాగేంద్రమ్మకి నలుగురు కుమారులు. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన ఈమె వ్యవసాయ పనుల నిమిత్తం  7 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు వద్దే ఉండి కూలి పనులకు వెళుతోంది. ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో నిర్జీవంగా పడి ఉన్న తీరు అందరినీ కలచివేసింది. ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్‌ది నిడుముక్కల గ్రామం కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.  

కలెక్టర్‌ పరామర్శ
గుంటూరు ఈస్ట్‌: లాం సంమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మంగళవారం పరామర్శించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు